ఆసక్తికరమైన ఆ కథనం ఇక్కడ వినిపిస్తుంది
అందగాడు ... మహా పరాక్రమవంతుడు అయిన సారంగధరుడు, రాజరాజనరేంద్రుడి కుమారుడు. యుక్తవయసులోకి అడుగుపెట్టిన అతనికి, రంగరాజు కూతురైన 'చిత్రాంగి' తో వివాహాన్ని జరిపించాలని నరేంద్రుడు అనుకుంటాడు. అందుకు సారంగధరుడు నిరాకరించడంతో నరేంద్రుడు కలవరపడతాడు. రంగారాజుతో బంధుత్వాన్ని కలిగివుండటం మంచిదని భావించిన ఆయన మంత్రి 'సింగన్న' ... అసలు విషయాన్ని దాచి నరేంద్రుడి కత్తికి 'బాసికం' కట్టి చిత్రాంగితో వివాహాన్ని జరిపిస్తాడు.
సారంగధరుడు మనోహరుడని తెలిసి ఈ వివాహానికి అంగీకరించిన చిత్రాంగి, తనని పెళ్లాడినది ఆయన తండ్రియని తెలుసుకుని బాధపడుతుంది. ఒకానొక సందర్భంలో సారంగధరుడిపట్ల తనకి గల ప్రేమానురాగాలను ఆమె వ్యక్తం చేస్తుంది. ఆమె వున్నది తల్లి స్థానంలోననే విషయాన్ని సారంగధరుడు గుర్తుచేస్తాడు. అహం దెబ్బతినడంతో తన పట్ల సారంగధరుడు కోరికను వ్యక్తం చేసినట్లు నరేంద్రుడితో అసత్యం చెబుతుంది.
ఆగ్రహావేశాలకిలోనైన నరేంద్రుడు, సారంగధరుడి కాళ్ళూ ... చేతులు తీసేయమని రాజభటులను ఆజ్ఞాపిస్తాడు. అంతఃపురాన్ని వదిలి వెళ్లిన సారంగధరుడిని వాళ్లు వెతికిపట్టుకుని ఆయన కాళ్ళూ చేతులను ఖండిస్తారు. అదే నేడు 'కత్తులకొండ' గా పిలవబడుతోంది. తల్లితో సమానురాలైన చిత్రాంగి స్వభావాన్ని బయటికి చెప్పకుండా మౌనంగా ఆ శిక్షను సారంగధరుడు అనుభవిస్తాడు.
బాధతో విలవిలలాడుతూనే అతికష్టం మీద ఆయన మరో కొండపైకి చేరుకోగా, అక్కడి సిద్ధులు ఆయనని చేరదీసి పునర్జన్మనిస్తారు. అదే 'సిద్ధుల కొండ' గా ప్రసిద్ధి చెందింది. ఆనాటి ఘటనకు నిదర్శనంగా ఈ కొండపై సిద్ధుల ప్రతిమలతో పాటు సారంగధరుడి విగ్రహం కూడా పూజలు అందుకుంటూ వుంటుంది. ఆసక్తికరమైన ఈ కథనం వినిపించే సిద్ధులగుట్ట, నెల్లూరు జిల్లా పరిధిలోని సైదాపురం సమీపంలో కనిపిస్తుంది.