అడిగిన వరాలనొసగే దేవదేవుడు

రంగనాయకస్వామి ఆలయాలు వైభవానికి ప్రతీకలుగా వెలుగొందుతుంటాయి. 'భోగి పండుగ' రోజున గోదాసమేత రంగనాయకస్వామికి అంగరంగవైభవంగా వివాహం జరిపేంతవరకూ స్వామి ఆలయాలు మరింత సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.

ఈ మాసంలో స్వామి దర్శనం చేసుకోవడం వలన ఆయన అనుగ్రహం మరింత తేలికగా లభిస్తుందని చెబుతుంటారు. అందువలన అనునిత్యం ఆ స్వామి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మారుమూల గ్రామాల్లో గల ఆలయాలు సైతం ఈ మాసంలో శోభను సంతరించుకుని దర్శనమిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో 'కంపాలపల్లి' ఒకటిగా కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. నేలబారున విశాలమైన విస్తీర్ణం కలిగిన ఒక బండపై ఈ ఆలయం నిర్మించబడింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం, అలనాటి వైభవాన్ని అనుభూతిగా దోసిట్లో పెడుతుంది. లోక కల్యాణానికి కారకుడైన స్వామి ప్రశాంతమైన వదనంతో దర్శనమిస్తూ ... భక్తులకు అభయాన్ని ఇస్తుంటాడు. భక్తులు సమర్పించే తులసిమాలలు ప్రీతితో స్వీకరిస్తూ వారి కోరికలను నెరవేర్చుతూ వుంటాడు.

వివాహం యోగం ... సంపదలు ... సంతాన సౌభాగ్యాలను స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడని భక్తులు చెబుతుంటారు. అయితే ఈ క్షేత్ర విశిష్టతను ... మహాత్మ్యాన్నీ మరింత వెలుగులోకి తీసుకురావలసిన అవసరం కనిపిస్తుంది. భక్తుల కోసమే కొలువై .. ఆ భక్తుల కష్టాలు వింటూ .. వాళ్ల కన్నీళ్లు తుడిచే స్వామివారి వైభవానికి ఆ భక్తులే కృషిచేయాలి. అలా జరిగితే స్వామివారికి పూర్వవైభవం దక్కుతుంది ... ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ గ్రామానికి అరుదైన గౌరవము లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News