ధనలక్ష్మీ చెంతకు నడిపించే ధైర్యలక్ష్మీ

భయమనేది ముందడుగు వేయనీయకుండా చేస్తూ ఉంటుంది. ఏ కార్యాన్ని ఆరంభించాలన్నా భయమనేది వెనక్కిలాగుతుంటుంది. ఎవరు ఏమనుకుంటారో ... అనుకున్నపని అవుతుందో లేదోననే భయమే ముందడుగు పడకుండా చేస్తుంటుంది. ఏ కార్యసాధనలోనైనా ఓటమికి భయపడి వెనకడుగు వేసేవాళ్లు, విజయోత్సవాన్ని చవిచూడలేరు.

ఇలా భయంతో వెనక్కితగ్గేవాళ్లు సదా 'ధైర్యలక్ష్మీ' ని స్తుతించడం వలన మంచిఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సమస్త దేవతలచే ... మహర్షిలచే నిరంతరం పూజించబడుతోన్న ధైర్యలక్ష్మీని సేవించడం వలన భయమనేది పారిపోతుందని చెప్పబడుతోంది. అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడైతే భయమనేది పటాపంచలవుతుందో అప్పుడు ధైర్యంగా ముందడుగు వేయడం జరుగుతుంది.

ప్రతిభాపాటవాలకు ధైర్యం తోడుకావడంతో వరుసగా విజయాలు పలకరిస్తాయి. విజయం ఎక్కడైతే వుంటుందో సంపదలు అక్కడ వుంటాయి. అందుకే 'ధైర్యే సాహసే లక్ష్మీ' అని అంటూ వుంటారు. ధైర్యలక్ష్మిని ఆశ్రయించినవాళ్లు భయంతో వెనుకడుగు వేయడమంటూ వుండదు. ఆ తల్లి ఆశీస్సులను అందిస్తూ ... విజయాల బాటలో నడిపిస్తూ ధనలక్ష్మి చెంతకు చేరుస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోను ధైర్యలక్ష్మి పాదాలను వీడకూడదు.


More Bhakti News