కరుణించిన స్వామి కలలో దర్శనమిస్తాడు
వేంకటేశ్వరుడిని భక్తులు ఆపదమొక్కులవాడిగా పిలుచుకుంటూ వుంటారు. అనాథలకు రక్షకుడిగా తలచుకుంటూ వుంటారు. కోరిన వరాలను ప్రసాదించే కల్పవృక్షంగా విశ్వసిస్తుంటారు. అడిగిన వెంటనే అనుగ్రహించే కామధేనువులా భావిస్తుంటారు.
ఆ స్వామిని దర్శించడం ... సేవించడంకంటే అదృష్టం మరొకటి లేదని అనుకుంటూ వుంటారు. ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు అలరారుతూ కనిపిస్తుంటాయి. అలా భక్తులతో నిత్యం సందడిగా కనిపించే ఆలయాలలో ఒకటి 'బొర్రాయిపాలెం' లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా త్రిపురవరం మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.
శ్రీదేవి - భూదేవి సమేతంగా ఇక్కడ వేంకటేశ్వరుడు కొలువుదీరి కొన్ని వందల సంవత్సరాలు అవుతోందని చెబుతుంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ కనిపిస్తుంది. ఇక్కడి స్వామివారిని అంకితభావంతో పూజిస్తూ ... సేవిస్తూ వుంటే, అనుగ్రహించినట్టుగా ఆయన స్వప్నదర్శనమిస్తాడని అంటారు.
స్వామివారిపై భారం వేసి ఆయనపట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగి వున్నట్లయితే తప్పక అనుగ్రహిస్తాడని అంటారు. స్వప్నంలో స్వామి కనిపించిన దగ్గర నుంచి శుభాలు జరుగుతూ ఉంటాయని చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా ఎంతోమంది భక్తులు తమ అనుభవాలను ఆవిష్కరిస్తూ వుంటారు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదంటూ ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.