భగవంతుడి లీలలన్నీ భక్తుల కోసమే !
భగవంతుడు తన భక్తులకు ఎన్నో పరీక్షలు పెడుతుంటాడు. నిజమైన భక్తులు మాత్రమే ఆ పరీక్షలను తట్టుకుని నిలబడుతుంటారు. ఆ పరీక్షలలో భక్తులు నెగ్గిన తరువాత, వాళ్ల భక్తివిశ్వాసాలు లోకానికి తెలియపరచడం కోసమే ఆ పరీక్షలు పెట్టాడనే విషయం స్పష్టమవుతూ ఉంటుంది. అందుకు ఉదాహరణగా కొంతమంది భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి.
గర్భాలయంలో పాడురంగస్వామి చేతికి ఉండవలసిన బంగారు కంకణాలు ఒకసారి మాయమవుతాయి. తనకి వాటిని పురందరదాసు ఇచ్చాడని రాజ్యాధికారికి ఒక వేశ్య చెబుతుంది. దాంతో వాళ్లు ఆయనని శిక్షించడానికి సిద్ధపడతారు. అది భగవంతుడి లీలావిశేషంగా భావించిన పురందరదాసు, తాను ఆ నేరం చేయలేదని పాండురంగడు భావిస్తే, మరో జత బంగారు కంకణాలు స్వామివారి చేతిని అలంకరిస్తాయని అంటాడు. అంతే .. అంతా చూస్తుండగానే స్వామి చేతులను మరో జత బంగారు కంకణాలు అలంకరిస్తాయి.
ఇక కనకదాసు కూడా కృష్ణుడి మెడలోని ఖరీదైన హారాన్ని కాజేసేశాడనే నిందని ఎదుర్కుంటాడు. తనకి స్వయంగా కృష్ణుడే ఆ హారాన్ని ఇచ్చి, తనని అల్లరిపెడుతున్నందుకు కనకదాసు నవ్వుకుంటాడు. రాజభటులు ఆయనని శిక్షించబోతుండగా, జరిగినదానిలో ఆయన ప్రమేయమేమీలేదని స్వామివారే స్వయంగా చెబుతాడు.దాంతో స్వామితో కనకదాసుకిగల బంధం ఎలాంటిదో అక్కడివారికి అర్థమవుతుంది.
ఇక భక్త తుకారామ్ ని ఊరునుంచి తరిమేయాలనే ఉద్దేశంతో కొంతమంది స్వార్థపరులు, గర్భాలయంలోని పాండురంగస్వామి విగ్రహాన్ని పాడుబడిన బావిలో పడేస్తారు. ఆ సమయంలో మౌనంగా వున్న స్వామివారు, తుకారామ్ నిస్వార్థ భక్తిని నిరూపించడం కోసం గ్రామస్తుల సమక్షంలో తిరిగి గర్భాలయంలో ప్రత్యక్షమవుతాడు. ఇలా స్వామి ఎన్నో లీలావిశేషాలను ప్రదర్శిస్తూ, భక్తుల గొప్పతనాన్ని ఈ లోకానికి తెలియజెబుతూ వచ్చాడు. భక్తుడికీ ... భగవంతుడికి గల విడదీయరాని అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ వచ్చాడు.