అమరలింగేశ్వర దర్శనమే మహాభాగ్యం

పరమశివుని అనుగ్రహాన్ని కోరుతూ దేవతలు సైతం అనేక ప్రదేశాల్లో ఆ స్వామిని ప్రతిష్ఠించి పూజించారు. ఆ స్వామి అనుగ్రహం కారణంగా వివిధ దోషాల నుంచి ... శాపాల నుంచి బయటపడ్డారు. అలా దేవతలచే ప్రతిష్ఠించబడిన సదాశివుడు తన భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటూ, వాళ్లకి కావలసిన వరాలను ప్రసాదిస్తూ వస్తున్నాడు.

దేవతలచే ప్రతిష్ఠించబడి ... పూజించబడి ఇప్పటికీ మహిమాన్వితమైనవిగా అలరారుతోన్న క్షేత్రాల్లో ఒకటిగా 'అమరవరం' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులకు దర్శనమిస్తోన్న శివలింగం వేలసంవత్సరాల నాటిదిగా చెబుతుంటారు. ఈ శివలింగాన్ని దేవతలు ప్రతిష్ఠించి పూజించారని అంటారు.

అమరులు విచ్చేసిన ప్రదేశం కావడం వలన ... అమరులు ప్రతిష్ఠించిన శివలింగం కావడం వలన ఇక్కడి స్వామిని 'అమరలింగేశ్వరస్వామి' గా ఆరాధిస్తుంటారు. అమరలింగేశ్వరుడు కొలువుదీరిన ప్రాంతం కావడం వలన ఈ ఊరికి 'అమరవరం' అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఇది ఎంతటి ప్రాచీనమైనదో ... అంతటి శక్తిమంతమైన క్షేత్రమని తెలిసిపోతుంది. స్వామివారి మహిమలు అందరికి అనుభవంలోకి రావడంతో, గ్రామస్తులు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు.

అమరలింగేశ్వరస్వామిని దర్శించుకోవాలనే ఆలోచన కలగడమే అదృష్టమనీ, ఆ స్వామిని దర్శించుకోవడమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ స్వామిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. ప్రతి సోమవారం రోజున ... పర్వదినాల్లోను స్వామివారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఆ స్వామిని స్మరిస్తూ ... సేవిస్తూ ... తరిస్తుంటారు.


More Bhakti News