ముక్కోటి ఏకాదశి రోజున దీపారాధన

దీపం సకలదేవతా స్వరూపం. దీపంలోని ఎరుపు .. పసుపు .. నీలం రంగులు త్రిమూర్తులకు ప్రతీక. అలాగే దీపం లక్ష్మీదేవి స్థానంగా కూడా చెప్పబడుతోంది. దీపం నిత్యం వెలుగుతోన్నచోట లక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తూ ఉంటుందని అంటారు.

అనునిత్యం సూర్యోదయానికి ముందు ... సూర్యాస్తమయం కాగానే దీపారాధన చేయడం వలన సమస్త దోషాలు నశించి సకలశుభాలు కలుగుతాయి. ఇక విశేషమైన రోజుల్లో చేసే ప్రత్యేక పూజల వల కలిగే ఫలితంలో సగం దీపారాధన వలన లభిస్తుంది. ఆయా విశేషాలను అనుసరించి దీపారాధనలో నూనె వాడటం జరుగుతుంటుంది.

కొన్ని సందర్భాల్లో నువ్వుల నూనె ... మరికొన్ని సమయాల్లో ఆవునెయ్యి ... అలాగే కొబ్బరినూనె వాడటం చేస్తుంటారు. ఆయా విశేషాలనుబట్టి శాస్త్రం సూచించిన ప్రకారం దీపారాధనలోకి నూనెను వాడటం వలన పరిపూర్ణమైన ఫలితాలు కలుగుతాయి. అలా ముక్కోటి ఏకాదశి విషయానికి వచ్చేసరికి దీపారాధనకి ఏ తైలం వాడితే మంచిదనే విషయంలో కొంతమందిలో సందేహం తలెత్తుతుంటుంది.

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించే ఈ రోజున దీపారాధనలోకి 'కొబ్బరినూనె' వాడటం ఉత్తమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. ఈ రోజున దీపారాధనలోకి ఉపయోగించవలసిన తైలంగా కొబ్బరినూనె విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అందువలన ముక్కోటి ఏకాదశి పర్వదినాన పూజామందిరంలో ని భగవంతుడి సన్నిధిలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఐదేసి వత్తుల చొప్పున వెలిగించి, స్వామివారికి ఇరువైపులా దీపారాధన కుందులు ఉండేలా చూడాలి. ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలను కోరుతూ భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆయన అనుగ్రహాన్ని అందుకుని తరించాలి.


More Bhakti News