కొండపై పాదాలు కోదండరాముడివేనట !
సీతాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్లడంతో ఆమెని వెతుకుతూ రామలక్ష్మణులు బయలుదేరుతారు. అలా ప్రయాణాన్ని కొనసాగిస్తూ మార్గమధ్యంలో అనేక ప్రాంతాలలో రాముడు శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లాడు. సీతాదేవి అన్వేషణ ఫలించేలా చేయమని కోరుతూ ఆయన శివలింగ ప్రతిష్ఠచేసి పూజానంతరం లక్ష్మణుడితో అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండేవాడు.
ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో శివలింగాలు కొలువై వుండటం ... అక్కడ స్వామి రామలింగేశ్వరుడుగా పిలవబడుతుండటం జరుగుతోంది. అలా శ్రీరామచంద్రుడు నడచివచ్చిన ప్రదేశంగా మనకి 'రామలింగేశ్వర కొండ' కనిపిస్తుంది. ఇక్కడ రాముడు శివలింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించాడని చెబుతుంటారు. అందుకుగుర్తుగా రాముడిదంటూ ఒక పాదముద్రను చూపుతుంటారు.
ఇలా రాముడితో ముడిపడి రామలింగేశ్వర కొండగా పిలవబడుతోన్న ఈ క్షేత్రం, 'కంఠం గూడెం' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం పరిధిలో ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ కొండపైకి చేరుకున్నవారు రామలక్ష్మణులు నడయాడిన ప్రదేశంలో తాము వున్నామనే అనుభూతికి లోనవుతుంటారు. రాముడు పూజించిన శివలింగాన్ని తాము దర్శిస్తున్నామనే ఆనందంతో తేలిపోతుంటారు.
ప్రాచీనకాలం నాటి క్షేత్రాలను ... ముఖ్యంగా రామాయణ కాలంనాటి క్షేత్రాలను దర్శించడం వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ క్షేత్రానికి వెళ్లడం వలన అలాంటి అనుభూతి కలుగుతుంది ... మనోఫలకంపై అది శాశ్వతంగా మిగిలిపోతుంది.