అమ్మ వున్న చోటునే హనుమంతుడు
హనుమంతుడి ఆలయాలు మహా శక్తిమంతమైనవిగా దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఆ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా అలరారుతుంటాయి. ఆ స్వామి వెలసిన ఒక్కోక్షేత్రం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటుంది.
అలాంటి విశేషాన్ని స్థలపురాణంగా కలిగిన క్షేత్రంగా 'అంజలీపురం' కనిపిస్తుంది. హనుమంతుడి తల్లి అంజనాదేవి పేరుతో ఈ గ్రామం 'అంజనాపురం' గా ఏర్పడిందనీ, అయితే కాలక్రమంలో ఈ పేరు మార్పుకిలోనై 'అంజలీపురం' గా పిలవబడుతోందని చెబుతుంటారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
పూర్వకాలంలో అంజనాదేవి ఈ ప్రదేశంలో తపస్సు చేసుకుందట. తల్లి తపస్సు చేసుకున్న ఈ ప్రదేశమంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమట. అందువలన ఆయన ఈ ప్రదేశంలో విగ్రహరూపంలో కొలువుదీరడం జరిగిందని అంటారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇక్కడి హనుమంతుడికి ఒకప్పుడు చిన్నమందిరం ఉండేది. స్థలపురాణం ... స్వామివారి మహిమలు వెలుగులోకి రావడంలో గ్రామస్తులంతా కలిసి ఆయనకి ఆలయాన్ని నిర్మించారు.
చాలాకాలం క్రితమే నిర్మించబడిన ఈ ఆలయం అంచెలంచలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రతి మంగళ .. శనివారాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి హనుమంతుడు ఇష్టపడి ఆవిర్భవించిన కారణంగా ఆయనని వేడుకుంటేచాలు వరాలను ప్రసాదిస్తాడని చెబుతుంటారు. దోషాలను ... దుఃఖాలను దూరంచేసి, ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తాడని అంటారు.