ముక్కోటిన తులసిదళాలతో విష్ణుపూజ
శ్రీమహావిష్ణువుకు తులసిదళాలు ఎంతో ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. వివిధరకాల పూలతో స్వామిని పూజించడం వలన కలిగే ఫలితం, కేవలం తులసిదళాలతో పూజించడం వలన కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది. ఇక విశిష్టమైన రోజుల్లో స్వామివారిని తులసిదళాలతో పూజించడం వలన కలిగే ఫలితం కూడా విశేషంగానే ఉంటుంది.
ముఖ్యంగా 'ముక్కోటి ఏకాదశి' రోజున స్వామివారిని అనేక రకాల పూలతో అలంకరించడం ... అర్చించడం జరుగుతుంది. ఈ రోజు పూజలోను 'తులసి' విశిష్టమైన పాత్రనే పోషిస్తూ కనిపిస్తుంది. తులసిదళాలతో పూజించడం వలన ఆ స్వామి మరింత ప్రీతిచెందుతాడు. ఈ రోజున ఉత్తరద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకోవడం ... ఉపవాస జాగరణలనే నియమాలను పాటించడం ... స్వామివారిని తులసిదళాలతో పూజించడం పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తాయి.
ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోయినవాళ్లు, వైష్ణవ సంబంధమైన ఆలయాలను దర్శించడం వలన ... తులసిదళాలతో స్వామివారిని అర్చించడం వలన కూడా పుణ్యఫలరాశి పెరుగుతుందనీ, మోక్షానికి అవసరమైన అర్హత ప్రసాదించబడుతుందని చెప్పబడుతోంది. అందువలన వైకుంఠ ఏకాదశిగా పిలవబడుతోన్న ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు జరిపే పూజలో తులసిదళాలు ఉండేలా చూసుకోవడం మరచిపోకూడదు.