వరాలను కురిపించే ప్రదక్షిణలు
సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా ప్రదక్షిణలు చేసి ఆ తరువాత దైవ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రదక్షిణల వలన దారిద్ర్యం ... దుఃఖం నివారించబడటమే కాకుండా, భగవంతుడి సన్నిధిలో నుంచునే అర్హత కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఇక కొన్ని క్షేత్రాల్లో ప్రదక్షిణలు మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రదక్షిణలు సంఖ్యాపరంగా కూడా నియమాన్ని కలిగివుంటాయి. ఆ సంఖ్య ప్రకారం ప్రదక్షిణలు చేయడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పబడుతోంది. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో 'మట్టపల్లి' ఒకటి. నల్గొండ జిల్లా పరిధిలో గల ప్రాచీన స్వయంభువు క్షేత్రాల్లో మట్టపల్లి ముందువరుసలో కనిపిస్తుంది.
కృష్ణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలో ప్రహ్లాద సహిత నరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. తనకి ముఫ్ఫైరెండు ప్రదక్షిణలు చేసినవారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని స్వామివారే స్వయంగా చెప్పా రనేది ఇక్కడ స్థలపురాణంగా వినిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తనని పట్టి పీడిస్తోన్న దోష ప్రభావం నుంచి బయటపడటానికి సాక్షాత్తు 'యమధర్మరాజు' ఇక్కడ ముఫ్ఫైరెండు ప్రదక్షిణలు చేసి ఫలితాన్ని పొందాడని చెబుతుంటారు. అందువలన ఇది 'యమమోహితి క్షేత్రం' గా కూడా పిలవబడుతోంది.
దుష్టశక్తులచే పీడించబడుతోన్నవాళ్లు ... గ్రహసంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు ... అనారోగ్య కారణాల వలన బాధలుపడుతోన్నవాళ్లు ఇక్కడి కృష్ణలో తలస్నానం చేసి వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక మనసులోని కోరిక నెరవేరడానికి ముందు ... ఆ తరువాత కూడా ప్రదక్షిణలు చేయవలసి వుంటుంది.
మనోభీష్టం నెరవేరాక పదకొండురోజుల పాటు స్వామి సన్నిధిలోనే వుంటూ, కృష్ణానదిలో మూడుపూటలా స్నానం చేసి వచ్చి ముఫ్ఫై రెండేసి ప్రదక్షిణలు చేస్తుండాలి. ఈ విధంగా చేయడం వలన స్వామి స్వప్న దర్శనం కూడా లభిస్తుందని చెబుతుంటారు. మనోహరమైన ... మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనం మరచిపోలేని అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.