అప్పుడే దేవతలు సంతోషిస్తారు

సత్యానికీ ... ధర్మానికి ప్రతీకగా చెప్పుకునే హరిశ్చంద్రుడు, ఆడినమాటకి కట్టుబడి తన రాజ్యాన్ని సైతం వదులుకుంటాడు. భార్యాబిడ్డలతో ... కట్టుబట్టలతో ఆయన ఆ రాజ్యం నుంచి బయలుదేరుతాడు. అప్పటివరకూ సిరిసంపదలతో వైభవంగా గడిపిన చంద్రమతి భర్త తీసుకున్న నిర్ణయాన్ని గురించి ప్రశ్నించకుండా మౌనంగా ఆయనని అనుసరిస్తుంది.

అడవులలో నడవలేక ... ఆకలిదప్పులకు తట్టుకోలేక నానాఅవస్థలు పడుతున్నా ఆమె భర్త ధోరణి పట్ల అసహనాన్ని ప్రదర్శించదు. పనిమనిషిగా కాలకౌశికుడికి అమ్ముడుపోవలసి వచ్చినా ఆమె బాధపడదు. భర్త సత్యనిష్ఠను నిలపడం భార్యగా తన ధర్మమని భావిస్తుంది. కాలకౌశికుడి ఇంట కష్టాలుపడుతున్నా ఆమె వాటిని గురించి పెద్దగా ఆలోచించదు.

తన భర్త ఎక్కడ వున్నా ఆయనని ఆ పార్వతీ పరమేశ్వరులు సదా కాపాడుతూ వుండాలని కోరుకుంటుంది. తాను కాశీరాజు ఆగ్రహానికి గురైనా ... తమ కుమారుడు మరణించినా ఆ దుఃఖంలో కూడా ఆమె తన భర్త వైఖరి పట్ల అసహనానికి లోనుకాదు. ఆ సమయంలోను ఆమె తన భర్త సత్యనిష్ఠకు భంగం కలగకూడదనే భావిస్తుంది. అందుకోసం తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడుతుంది.

సత్యం కోసం ... ధర్మం కోసం హరిశ్చంద్రుడు ఎంతటి మనోనిబ్బరాన్ని చూపాడో, అందుకు అడ్డుపడకుండా చంద్రమతి కూడా అంతే మనోనిబ్బరాన్ని చూపుతుంది. ఎంతటి విషమ పరిస్థితులు ఎదురైనా అందుకు తన భర్తే కారకుడనే విషయాన్ని ఆమె మనసులోనికి రానీయదు. అడుగడుగునా ఆయనకి సేవలు చేస్తూ ... సత్యవ్రత ఆచరణలో అనుక్షణం ఆయనకి సహకరిస్తుంది. అందుకే ఆ దంపతులపై దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. తరతరాలవారు వాళ్ల చరిత్రను చెప్పుకుని తరిస్తారని ఆశీర్వదిస్తారు.


More Bhakti News