అమ్మ ఆశీస్సులుంటే అన్నీ ఉన్నట్టే !

అనంతమైన ప్రేమకు ... అసమానమైన అనురాగానికి నిదర్శనంగా అమ్మమనసు కనిపిస్తూ ఉంటుంది. బిడ్డల బాగోగులను గురించి అమ్మలా మరొకరు ఆలోచించలేరు. అమ్మలా మరొకరు ఆదుకోనూ లేరు. తన బిడ్డల యోగ క్షేమాలను గురించి తప్ప అమ్మ మరో ఆలోచన చేయదు. బిడ్డల బాగుకోసమే ఆమె అహర్నిశలు పరితపిస్తుంది ... అందుకోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది.

అలా అమ్మ తరువాత తన బిడ్డల విషయంలో ఆరాటపడేదిగా జగజ్జనని అయిన అమ్మవారే కనిపిస్తుంది. అమ్మలగన్న అమ్మగా పూజాభిషేకాలు అందుకుంటుంది. అలా ఆ తల్లి కామధేనువులా అలరారుతోన్న క్షేత్రాల్లో ఒకటి 'మఠంపల్లి' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ మండల కేంద్రంలో కనకదుర్గమ్మవారి క్షేత్రం విలసిల్లుతోంది.

సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణంగా కనిపించే ఈ ఆలయం ప్రాచీనకాలం నాటిదని చూడగానే తెలిసిపోతుంటుంది. ఒకప్పటి వైభవానికి అద్దంపడుతూ కనిపించే ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా దర్శనమిస్తూ ఉంటుంది. గర్భాలయంలో గల అమ్మవారి మూర్తిని దర్శిస్తేచాలు, ఆ తల్లి అండదండలు ఉండగా చింతించవలసిన పనిలేదనే భరోసా కలుగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు.

దేవీ నవరాత్రోత్సవాల్లో ఇక్కడి అమ్మవారి వైభవాన్ని చూసితీరవలసిందే. ఇక్కడి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటేచాలు సకల శుభాలు చేకూరతాయని అంటారు. ఆ తల్లిని పూజించడం వలన తలపెట్టినకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు. సంపదలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతుంటారు. అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు ... పునీతులవుతుంటారు.


More Bhakti News