ముక్కోటి ఏకాదశి రోజున నైవేద్యం
వైష్ణవ సంబంధమైన ఆలయాలన్నీ ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామునే భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ వుంటాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికిగాను భక్తులు ఆలయాలకి పెద్దయెత్తున తరలివస్తుంటారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి - భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగివచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షానికి అవసరమమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది. విశేషమైన రోజుల్లో స్వామివారికి జరిపే పూజాభిషేకాల విషయం అటుంచితే, ఆ రోజుల్లో సమర్పించే నైవేద్యం కూడా విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ముక్కోటి రోజున స్వామివారికి ఏ నైవేద్యం సమర్పిస్తే మంచిదనే విషయంలో కొంతంమంది ఆలోచనలో పడుతుంటారు. ఈ రోజున స్వామివారికి ప్రీతికరమైన 'పాయసం'తో పాటు వివిధరకాల తీపిపదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.