ఆపదలో ఆదుకునే భగవంతుడు

తనబిడ్డ ఆపదలో ఉందనే విషయం తల్లికి సహజంగానే తెలిసిపోతూ ఉంటుంది. మనసంతా గుబులు గుబులుగా అన్పించడంతో ఆ తల్లి వెంటనే తనబిడ్డ దగ్గరికి బయలుదేరుతూ వుంటుంది. సాధ్యమైనంత త్వరగా తన బిడ్డను చేరుకోవాలని ఆరాటపడుతుంది. భగవంతుడు కూడా తన భక్తుల విషయంలో ఇదే విధంగా ఆరాటపడతాడు.

భక్తులు ఆపదలో వున్నారని అనిపించిన మరుక్షణం భగవంతుడు ఆలస్యం చేయకుండా వస్తూనే వుంటాడు. తన కరుణా కటాక్ష వీక్షణాలతో వాళ్లను అనుగ్రహిస్తూనే వుంటాడు. అందుకు ఉదాహరణగా ఒక సంఘటనను గురించి చెప్పుకోవచ్చు. రాఘవేంద్రస్వామి తన శిష్యబృందంతో కలిసి అనేక ప్రాంతాలను దర్శిస్తూ వెళుతుంటాడు. అలా ముందుకు వెళుతోన్న స్వామి ఒక్కసారిగా ఆగిపోతాడు. తాను వెళుతోన్న మార్గాన్ని మార్చుకుని మరోవైపుకి వేగంగా అడుగులు వేస్తుంటాడు.

స్వామి అలా హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వెనుక ఏదో కారణముంటుందని భావించిన శిష్యులు, మౌనంగా ఆయనని అనుసరిస్తారు. అలా ఆ నిర్జన ప్రదేశంలో కొంతదూరం వెళ్లాక, నిరుపేదలైన భార్యాభర్తలు వాళ్లకి కనిపిస్తారు. హఠాత్తుగా భర్త అనారోగ్యానికి గురికావడంతో నిస్సహాయురాలైన భార్య అక్కడ ఒంటరిగా రోదిస్తూ వుంటుంది. స్వామిని చూడగానే ఆమె దుఃఖం మరింత ఎక్కువవుతుంది. ఆయన దర్శనం కోసమే తాము బయలుదేరామనీ, మార్గమధ్యంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అప్పటివరకూ స్పృహలో లేని ఆమె భర్త స్వామి కృపాదృష్టి సోకగానే ఈ లోకంలోకి వస్తాడు. ఎదురుగా స్వామివారు కనిపించడంతో ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. తనని రక్షించడం కోసమే స్వామివారు వచ్చారని తెలిసి సంతోషంతో పొంగిపోతాడు. తాము దర్శించడానికి బయలుదేరిన దేవుడు తమ దగ్గరికే నడచుకుంటూ వచ్చాడంటూ ఆ భార్యాభర్తలు స్వామివారి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులను అందుకుంటారు. భక్తులు ఆపదలో వున్నప్పుడు భగవంతుడికి వెంటనే తెలిసిపోతుందని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.


More Bhakti News