ఆర్ధిక పరిస్థితి ఇలా మెరుగవుతుంది
ఆనందమైనా ... సంతోషమైనా ఎక్కువగా ఆర్ధికపరిస్థితిపైనే ఆధారపడి ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మంచిగా ఉన్నంతవరకూ మిగతా సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా తీసుకుని పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్ధికంగానే ఇబ్బందుల్లోపడితే ఆ తరువాత ఎదురయ్యే ప్రతిసమస్య పెద్దదిగానే కనిపిస్తుంది.
ఆర్ధికపరిస్థితే అన్ని సమస్యలకు పరిష్కారం కాకపోయినా, మానసికంగా బలంగా ఉండేలా చేసి సమస్యను ఎదుర్కునే శక్తిని ఇస్తుంది. అవసరాలైనా ... అవాంతరాలైనా ఆర్ధికపరిస్థితితో ముడిపడినవే కాబట్టి, డబ్బు దగ్గర లేనప్పుడు ఎవరైనా ఆందోళన చెందుతూనే ఉంటారు ... కంగారును కనబరుస్తూనే వుంటారు. ఆర్ధికపరమైన లేమికి ... ఆత్మాభిమానానికి సంబంధం ఉంటుంది కనుక, సాధ్యమైనంత తొందరగా ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలానే కోరుకుంటూ వుంటారు.
అలా ఆర్ధికపరంగా ఇబ్బందులు పడుతున్నవాళ్లు మూగజీవాల పట్ల సానుభూతిని కలిగివుంటే, ఆ సమస్య నుంచి బయటపడతారని చెప్పబడుతోంది. చీమలకు పంచదార ... గోధుమరవ్వ, చేపలకి పండ్లముక్కలు ... పక్షులకు నూకలు ... కోతులకు అరటిపండ్లు ... కుక్కలకు రొట్టెలు ... గుర్రాలకి గుగ్గిళ్లు ... ఆవులకు అన్నం సమకూర్చడం వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పబడుతోంది. తన చుట్టూ వున్న జీవులకు ఆహారాన్ని అందించాలనే ఆలోచనే భగవంతుడి మనసు గెలుచుకుంటుంది.
ఒక వ్యక్తిపై కొన్నిజీవులు ఆధారపడి ఉన్నాయని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఆర్ధికపరమైన ఎదుగుదలకి అడ్డుపడుతోన్న దోషాలను భగవంతుడు నివారిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ వ్యక్తికి ఆర్ధికపరమైన లోటు రానీయడు. మరిన్ని జీవులకు అతను ఆహారాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో అతని స్థాయిని పెంచుతూ వెళతాడు. అందువలన ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కుంటోన్నవాళ్లు తమచుట్టూ వున్న జీవరాశికి ఆహారాన్ని అందించడం వలన పరిస్థితి చక్కబడుతుందనే విషయాన్ని మరిచిపోకూడదు.