సంతాన భాగ్యాన్ని ప్రసాదించే క్షేత్ర దర్శనం

సంతానం కలిగే విషయంలో ఆలస్యం జరుగుతున్నట్టుగా అనిపిస్తేచాలు, కొత్తదంపతులు ఆందోళనచెందుతుంటారు. పెద్దల సలహామేరకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు ... నోములు పడుతుంటారు. ఆయా క్షేత్రాలను దర్శించడం వలన సంతానభాగ్యం కలుగుతుందని ఎవరైనా చెబితే ఆ స్వామిని దర్శించుకుని మనసులోని మాటను చెప్పుకుంటూ వుంటారు.

ఈ నేపథ్యంలో కొన్ని క్షేత్రాలను దర్శించడం వలన సంతానభాగ్యం తప్పనిసరిగా కలుగుతుందనే విషయం భక్తుల మాటలనుబట్టి తెలుస్తుంటుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి 'తొగర్రాయి' లో కనిపిస్తుంది. ఈ గ్రామం నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి సువిశాలమైన ప్రదేశంలో 'రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి'వారి ఆలయం దర్శనమిస్తుంది.

ప్రాచీనకాలంనాటి ఈ ఆలయం ఆనాటి వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మానసిక ప్రశాంతత ప్రసాదంగా దొరుకుతుంది. ఇక్కడి వేణుగోపాలుడు సంతానాన్ని అనుగ్రహిస్తాడనే బలమైన విశ్వాసం భక్తులలో కనిపిస్తుంది. అందువల్లనే ఆయనని సంతాన వేణుగోపాలుడుగా కొలుస్తుంటారు.

సంతానలేమి కారణంగా బాధపడుతూ ఇక్కడి స్వామిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందినవాళ్లు ఎంతోమంది ఉన్నారని చెబుతుంటారు. అలా స్వామి కృపతో సంతానాన్ని వరంగా పొందిన వాళ్లు ఆ సంతానానికి సంబంధించిన వేడుకలను ఇక్కడే నిర్వహిస్తుంటారు. కోరిన వరాలను అనుగ్రహిస్తూ కొంగుబంగారంగా చెప్పుకుంటోన్న ఇక్కడి వేణుగోపాలుడి క్షేత్రాన్ని దర్శించడం మరచిపోలేని అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


More Bhakti News