ఇప్పటికీ మహర్షులు ఇక్కడికి వస్తారట !

కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ఇప్పటికీ అక్కడికి రాత్రివేళల్లో దేవతలు ... మహర్షులు వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారనే విషయం స్థలపురాణంగా వినిపిస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ ఉంటాయని తెలిసినప్పుడు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. మహిమాన్వితమైన అలాంటి క్షేత్రాలను దర్శించుకోవడం మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

అలాంటి అనుభూతిని అందించే క్షేత్రంగా 'మట్టపల్లి' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. తనపట్ల ప్రహ్లాదుడికి గల విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ... హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం నరసింహస్వామి అవతరిస్తాడు. లోకకల్యాణ కారకమైన ఆ ఘట్టం ముగిసిన తరువాత, బాలుడైన ప్రహ్లాదుడి ప్రార్ధనమేరకు స్వామి శాంతించి అతణ్ణి అక్కునచేర్చుకుంటాడు.

ఆ సందర్భాన్ని కళ్లకి కడుతూ ప్రహ్లాదుడితో కలిసి నరసింహస్వామి వెలసిన క్షేత్రంగా మట్టపల్లి కనిపిస్తుంది. గర్భాలయంగా చెప్పబడుతోన్న గుహలో ఆదిశేషుడి పడగ నీడలో ప్రహ్లాద సహిత నరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఆ తరువాత కాలంలో ఇక్కడ రాజ్యలక్ష్మీదేవిని ... చెంచులక్ష్మిని ప్రతిష్ఠించారు. కృష్ణానదీ తీరంలో గల ఈ క్షేత్రం అనేక మహిమలకు నిలయంగా కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పటికీ ఇక్కడికి రాత్రివేళలో మహర్షులు అదృశ్యరూపంలో వస్తారనీ, స్వామివారిని పూజించుకుని వెళతారని చెబుతారు. ముందురోజు రాత్రి గర్భాలయంలో స్వామివారి ఎదుట శుభ్రం చేసి వెళ్లిన అర్చకులు మరునాడు ఉదయం గర్భాలయంలోకి అడుగుపెట్టగానే, అక్కడ తులసి దళాలు ... పుష్పాలు కనిపిస్తూ ఉంటాయట.

ఇక ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి కృష్ణానది పొంగిపొర్లుతూ వచ్చి స్వామివారిని అభిషేకిస్తుందనేది స్థలపురాణంగా వినిపిస్తుంది. అందుకు తగినట్టుగానే ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి కృష్ణానది పొంగి గర్భాలయంలోని మూలమూర్తి శిరోభాగాన్ని తాకి క్రమేణా తగ్గిపోతుంది. ఇలా ఈ క్షేత్రంలో కనిపించే ఎన్నో విశేషాలు ఇది మహా శక్తిమంతమైన క్షేత్రమనీ ... మహిమాన్వితమైన క్షేత్రమనే విషయాన్ని పదే పదే గుర్తుచేస్తూనే వుంటాయి.


More Bhakti News