వివాహయోగం కలిగించే వేంకటేశ్వరుడు
వైభవమంటే వేంకటేశ్వరస్వామిదే ... అదృష్టమంటే ఆయనని దర్శించే భక్తులదే. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా కొలవబడుతోన్న ఆ స్వామిని ఆర్తితో పిలిస్తేచాలు ఆప్యాయంగా పలుకుతాడు. కొండంత వరాలను కోరినా ఆనందంగా అనుగ్రహిస్తాడు.
దర్శనమాత్రంచేతనే ధన్యులనుచేసే దివ్యమంగళ రూపం ఆయనది. కనులనిండుగా కనిపిస్తూ కష్టాలు తొలగించే సుమనోహరమైన నవ్వు ఆయనది. అలాంటి ఆ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఆరాటపడుతుంటారు. తమ ఆవేదనలు చెప్పుకుని కరుణ చూపమని కోరుతుంటారు. ఈ కారణంగానే వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి.
అలా భక్తజనకోటిచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రాలలో ఒకటి నల్గొండ జిల్లా పాత హుజూర్ నగర్ లో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో ఇక్కడ నిర్మించబడిన 'శ్రీగోదాసమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి' ఆలయం చూసితీరవలసిందే. భారీ నిర్మాణంగా కనిపించే ఈ ఆలయం స్వామివారి వైభవానికి అద్దంపడుతూ వుంటుంది. ధనుర్మాసంలో ప్రత్యేక పూజలతో ... విశేషమైన సేవలతో ఆలయ వాతావరణం ఎంతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది.
ఈ సందర్భంగా అనునిత్యం స్వామివారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ధనుర్మాసంలో ఇక్కడి గోదాసమేతా కల్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వలన, వివాహ యోగం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. వివిధ కారణాల వలన వివాహం విషయంలో జాప్యం జరుగుతున్నప్పుడు ఆ స్వామిని దర్శించుకుని పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. గోదా సమేత వేంకటేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతుంటారు.