పాతాళ గణపతిని దర్శిస్తే చాలు
వినాయకుడిని ప్రార్ధిస్తేచాలు తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడిని ప్రార్ధించడం ద్వారానే దేవతలు ... మహర్షులు తాము తలపెట్టిన కార్యాలను సఫలీకృతం చేయగలిగారు.
అలాంటి వినాయకుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు పాతాళమార్గంలో ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటాయి. అలా వినాయకుడు పాతాళంలో ఆవిర్భవించిన క్షేత్రంగా 'శ్రీకాళహస్తి' దర్శనమిస్తుంది. పాతాళంలో కొలువైన ఇక్కడి వినాయకుడిని 'పాతాళ గణపతి' గా కొలుస్తుంటారు.
గణపతి పాతాళ మార్గాన కూడా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అందువల్లనే ఆయన ఎలుకను వాహనంగా చేసుకున్నాడని కూడా అంటారు. అలా ఒకసారి ఆయన పాతాళమార్గాన ప్రయాణం చేస్తూ, అగస్త్య మహర్షి ప్రార్ధనను ఆలకిస్తాడు. స్వామివారి జాడ తెలుసుకున్న అగస్త్యుడు వెంటనే అక్కడికి చేరుకుంటాడు.
తన తపోశక్తిచే 'స్వర్ణముఖి' నదిని ప్రవహింపజేయాలనుకున్నననీ, అయితే తొలిగా ఆయనని పూజించకపోవడం వలన నదికి మార్గం మాత్రమే ఏర్పడిందని అగస్త్యుడు అంటాడు. ఆ మార్గంలో నీటిని ప్రవహింపజేయవలసిందిగా గణపతిని కోరతాడు. అందుకు గణపతి అంగీకరించడమే కాకుండా, అగస్త్యమహర్షి అభ్యర్థన మేరకు ఆయనకి కనిపించిన ... కరుణించిన ఈ ప్రదేశంలోనే ఆవిర్భవిస్తాడు.
అలా నలభై అడుగుల లోతులో ఇక్కడ కొలువైన పాతాళ గణపతి మహా మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ స్వామి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించుకుని ఆరంభించిన ప్రతికార్యం విజయవంతంగా పూర్తవుతుందని చెబుతుంటారు.