అడగకనే అనుగ్రహించే దేవుడు !
సుధాముడు (కుచేలుడు) ఆర్ధికపరమైన ఇబ్బందులతో నానాఅవస్థలు పడుతుంటాడు. ఎవరినో యాచించటం ఆయనకి ఎంతమాత్రం ఇష్టంలేని పని. అందువలన ఒకపూట తింటే ఒకపూట పస్తులుంటూ భార్యాబిడ్డలతో ఇబ్బంది పడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే కృష్ణుడి సాయాన్ని కోరమని భార్య ఇచ్చిన సలహా ఆయనకి నచ్చుతుంది.
కృష్ణుడు తన బాల్యమిత్రుడే కనుక ఆ చనువుతో తన పరిస్థితి చెప్పుకోవచ్చని ఆయన అనుకుంటాడు. కృష్ణుడు దగ్గరికి ఉత్తచేతులతో వెళ్లలేక ఇంట్లో కాసిన్ని అటుకులు వుంటే అవి తీసుకుని బయలుదేరుతాడు. ద్వారకానగరానికి చేరుకొని కృష్ణుడిని కలుసుకుంటాడు. ఆయనకి ఆప్యాయంగా ఆహ్వానం పలికిన శ్రీకృష్ణుడు అతిథి మర్యాదలు చేస్తాడు.
కుశల ప్రశ్నలు వేస్తూ వివిధ రకాల పదార్థాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ విందును సుధాముడు ఆరగిస్తూ ఉండగా, ఆయన తెచ్చిన అటుకులను అంతకన్నా ఇష్టంగా కృష్ణుడు ఆరగిస్తాడు. కృష్ణుడి నుంచి ఊహించినదానికంటే ఎక్కువగా ప్రేమాభిమానాలు లభించడంతో, ఆయన్ని సుధాముడు సాయం అడగలేకపోతాడు. తన రాక వలన కృష్ణుడికి కలిగిన ఆనందాన్ని, తన కష్టాలు చెప్పి తుడిచేయకూడదని మౌనంగా ఉండిపోతాడు.
సాక్షాత్తు పరమాత్ముడు తన కాళ్లు కడిగి .. దగ్గర కూర్చుని భోజనం ఏర్పాట్లు చూసినప్పుడు, అది కాదంటూ తాను ఏ విషయాన్ని ప్రస్తావించగలడు ? అందుకే వచ్చిన విషయాన్ని మనసులోనే దాచుకుని కృష్ణుడి దగ్గర సెలవు తీసుకుంటాడు. తాను అటుకులు తెచ్చినప్పుడే తన పరిస్థితి ఏమిటనేది కృష్ణుడు గ్రహించి ఉంటాడని అనుకుంటాడు.
నోరు తెరిచి పధ్నాలుగు భువనభాండాలను చూపిన స్వామిని తాను నోరు తెరిచి అడగాలా ? అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. తన ఇల్లు సిరిసంపదలకు నిలయంగా మారడం ... తన భార్యాబిడ్డలు సంతోషంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. తనలాంటి వాళ్లు అడిగి సాయం చేస్తారు. కానీ భగవంతుడు తెలుసుకుని అనుగ్రహిస్తాడని అర్థంచేసుకుని మనసులోనే ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.