వేల సంఖ్యలో త్రిశూలాలు దర్శనమిచ్చే చోటు
పరమశివుడి ఆయుధంగా కనిపించే 'త్రిశూలం' ఎంతో ప్రత్యేకతను ... మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆదిదేవుడి అనంతమైన శక్తికీ ... అసురలపై ఆయన సాధించిన విజయాలకి త్రిశూలం ప్రతీకగా దర్శనమిస్తూ ఉంటుంది. కేవలం త్రిశూలం మాత్రమే కనిపించినా దానిని పరమేశ్వర స్వరూపంగానే భావించి నమస్కరించడం జరుగుతూ ఉంటుంది.
ఆ స్వామి ఆవిర్భవించిన కొన్నిక్షేత్రాల్లో ముందుగా త్రిశూలానికి పూజాభిషేకాలు నిర్వహించి ఆ తరువాత దైవదర్శనం చేసుకునే ఆచారం కనిపిస్తూ ఉంటుంది. ఇంతటి విశేషాన్ని సంతరించుకున్న త్రిశూలం వేల సంఖ్యలో కనిపించే ప్రదేశం ఒకటుంది ... అదే ... 'చౌరాగడ్' మందిరం. పరమశివుడి లీలా విశేషాలకు వేదికగా చెప్పుకునే ఈ ప్రదేశం మధ్యప్రదేశ్ - 'పచ్ మఢి' ప్రాంతంలో కనిపిస్తుంది.
కొండపైనున్న చౌరాగడ్ మందిరాన్ని చేరుకోవడం కొంచెం కష్టతరమైన పనే. కొత్తగా ఈ ప్రదేశానికి చేరుకున్నవారు ఇక్కడి ఆలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో గల త్రిశూలాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడి భూమిని చీల్చుకుంటూ త్రిశూలాలు మొలిచాయా అన్నంతగా ఈ ప్రదేశమంతా త్రిశూలాలతో నిండి ఉంటుంది. కష్టాల నుంచి బయటపడేయమనీ ... ఆపదల నుంచి గట్టెక్కించమని ... భవిష్యత్తును నిర్దేశించే పని పూర్తయ్యేలా చూడమని స్వామిని కోరుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది.
స్వామి అనుగ్రహంతో ఆ కోరిక నెరవేరితే మహిమాన్వితమైన ఈ ప్రదేశంలో త్రిశూలాన్ని ప్రతిష్ఠిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. అలా కోరికలు నెరవేరినవారు ఇక్కడ త్రిశూలాన్ని ప్రతిష్ఠించి మొక్కుచెల్లించుకుంటూ ఉంటారు. పరమశివుడి పట్ల గల విశ్వాసానికి నిదర్శనంగా ఇవి నిలిచినట్లు కనిపిస్తుంటాయి. శివ సంబంధమైన ఈ ప్రదేశంలో ఇలా త్రిశూలాలను అనేకంగా చూసినప్పుడు కలిగే ఆనందం వేరు ... అనుభూతి వేరు.