శివుడికి రుద్రాభిషేకం చేయిస్తే చాలు !
సాధారణంగా ఒక గర్భాలయంలో ఒకే శివలింగం పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. 'కాళేశ్వరం' వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అక్కడి స్థలపురాణాన్ని బట్టి గర్భాలయంలో రెండు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఒకే గర్భాలయంలో మూడు శివలింగాలు కొలువుదీరిన క్షేత్రం కూడా లేకపోలేదు. అలా మూడు శివలింగాలు ఒకే గర్భాలయంలో కొలువైన క్షేత్రం 'నాగుల పహాడ్' లో కనిపిస్తుంది.
నల్గొండ జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ప్రాచీన దేవాలయం, ఆనాటి వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇక్కడి గర్భాలయంలో 'ఐతేశ్వరుడు' ... 'కాటేశ్వరుడు' ... 'నాగేశ్వరుడు' పేరుతో మూడు శివలింగాలు దర్శనమిస్తుంటాయి. వివాహం విషయంలో ఆలస్యం జరుగుతున్నప్పుడు ఈ మూడు శివలింగాలకు ఒకేసారి 'రుద్రాభిషేకం' చేయించడం వలన ఆ సమస్య వెంటనే పరిష్కారమవుతుందనే విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంటుంది.
వివిధ కారణాల వలన వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు, ఇక్కడి మూడు శివలింగాలకు రుద్రాభిషేకం చేయిస్తుంటారు. ఈ విధంగా చేయించడం వలన వివాహానికి అడ్డుపడుతోన్న దోషాలు నశిస్తాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి స్వామి అనుగ్రహంతో వివాహం జరిగి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే కొత్త దంపతులు కనిపిస్తుంటారు. ఈ కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.