అండదండగా నిలిచిన ఆంజనేయుడు
జీవితం ఎన్నో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది. సమస్యల సుడిగుండంలో ... కష్టాల కొలిమిలో నిలబెడుతుంది. ఒక్కోసారి కన్నవాళ్ల ప్రేమకు సైతం దూరం చేసి, ఆకలితో అలమటించేలా చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆదరించకుండా ... ఆదుకోకుండా భగవంతుడు చూస్తూ ఊరుకోలేడు.
పరిస్థితులు పగబట్టినప్పుడు పోరాడే శక్తిలేక నిస్సహాయంగా మిగిలిపోయినప్పుడు ఆప్యాయంగా తన చేతిని అందించేవాడే భగవంతుడు. అలా బాల్యంలోనే కన్నవాళ్లకు దూరమైన తులసీదాసు, హనుమంతుడే దారి చూపించినట్టుగా ఆయన ఆలయానికి చేరుకుంటాడు. ప్రతిరోజు ఆలయంలో పెట్టే ప్రసాదాలతో ఆయన కడుపునింపుకుంటూ ఉంటాడు.
స్వామి అనుగ్రహమేనన్నట్టుగా ఒకరోజు అక్కడికి వచ్చిన 'నరహరిదాసు' దృష్టిని తులసీదాసు ఆకర్షిస్తాడు. భగవంతుడి లీలావిశేషాలను కథలుగా గానంచేస్తూ తిరుగుతూ ఉండే ఆయనని తులసీదాసు అనుసరిస్తాడు. ఆయన ద్వారా కొంత శాస్త్రపరిజ్ఞానాన్ని సంపాదిస్తాడు. వ్యామోహాలు భగవంతుడి సేవకి దూరం చేస్తాయని గ్రహించిన తులసీదాసు, వాటికి దూరమై ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. తన రచనలతో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేసి కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తాడు.
ఈ సమయంలోనే కొంతమంది అసూయాపరులు తులసీదాస్ కి ప్రాణహాని తలపెడతారు. అప్పుడు హనుమంతుడు వాళ్లకి తగిన విధంగా బుద్ధిచెప్పి తులసీదాస్ ని కాపాడతాడు. శ్రీరాముడిని కీర్తిస్తూ ... సేవిస్తూ గడిపిన తులసీదాసు, సీతారాములను ప్రత్యక్షంగా దర్శించాలని అనుకుంటాడు. బాల్యంలోను ఆ తరువాత తనకి సాయపడిన హనుమంతుడే వారి దర్శనం చేయించగలడని భావించి ఆయనని ప్రార్ధిస్తాడు. తనపట్ల తులసీదాస్ కి గల విశ్వాసానికి హనుమంతుడు ఆనందిస్తాడు. తులసీదాస్ కి సీతారాముల సాక్షాత్కారం లభించేలా చేస్తాడు. ఇలా తులసీదాస్ కి అడుగడుగునా అండదండగా వుంటూ వచ్చిన హనుమంతుడు ఆయన జీవితానికో అర్థాన్నీ ... పరమార్థాన్ని కల్పించాడు.