సంతోషాలను ప్రసాదించే సదాశివుడు

ఆదిదేవుడు ఆవిర్భవించిన ఒక్కోక్షేత్రం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. ఆ స్వామి అడవిలో అవతరించినా ... కొండకోనలపై కొలువుదీరినా భక్తులు ఆయనని ఒంటరిగా వదిలేయరు. స్వామి దర్శనం ఎంత కష్టమైనా బృందాలుగా కలిసి వెళుతూనే ఉంటారు. ఆయనని పూజించుకుని పునీతులవుతూనే ఉంటారు.

మహర్షులు ... మహారాజుల కాలంలో ఆవిర్భవించిన క్షేత్రాలు మహిమాన్వితమైనవే అయినా, సుదూర ప్రాంతాల్లో ఉండే భక్తులకు నిత్యం దర్శించుకోవడం కుదరదు. అనునిత్యం ఆ స్వామిని దర్శించుకోవాలనే భక్తులకు గల ఆరాటానికి నిదర్శనంగా అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి శివాలయాలలో ఒకటి 'గుర్రంగూడ' లో అలరారుతోంది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

గుర్రంగూడలో ప్రాచీనకాలంనాటి హనుమంతుడి ఆలయం వుంది. అలాగే సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన శిరిడీ సాయిబాబా ఆలయం వుంది. ఈ ఆలయాలకు చేరుకోవడానికి ముందే ఈ శివాలయం కనిపిస్తుంది. శివుడు ఎక్కడ ఆవిర్భవించినా ... ప్రతిష్ఠించబడినా ఆయనకి నిర్వహించబడే పూజాభిషేకాలు అనంతమైన పుణ్యఫలాలను అందిస్తూ ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అదే విధంగా ఇక్కడి శివుడు నిత్యనీరాజనాలు అందుకుంటూ అనుగ్రహిస్తూ వుంటాడు.

'బృందావన కాలని' లో నిర్మించబడిన ఈ శివాలయం కుదురుగా అందంగా తీర్చిదిద్దబడి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అందువల్లనే కాలనీకి చెందిన భక్తులు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు. సోమవారాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ... పూజలు జరుపుతుంటారు. విశేషమైన రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులసంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సమస్యలు తొలగిపోతాయనీ, సంతోషాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు.


More Bhakti News