ఆయన విజయరహస్యం అదే !

తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది గురువును ఆశ్రయిస్తుంటారు. తాము ప్రయాణించవలసిన మార్గాన్ని గురించి గురువును సలహాలు ... సూచనలు అడుగుతుంటారు. తాము అనుకున్న విధంగా ... ఆశించిన విధంగా గురువు సలహా ఇస్తే సంతోషంగా పాటిస్తారు. లేదంటే గురువు చెప్పిన మాటను పక్కకు పెట్టి, తాము ఏదైతే అనుకున్నారో దానినే చేస్తుంటారు.

అలా చేసిన పనిలో పరాజయం ... పరాభవం ఎదురైనప్పుడుగాని ఆ రోజున గురువు అలా ఎందుకు చెప్పాడనేది అనుభవంలోకి రాదు. ఛత్రపతి శివాజీ ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. దైవభక్తి ... దేశభక్తి .. గుర్తుభక్తి ... అసమానమైన స్థాయిలో కలిగివున్నవాడు శివాజీ. సాక్షాత్తు భవానీదేవి ప్రత్యక్షమై ఆయనకీ 'చంద్రహాస' అనే ఖడ్గాన్ని బహుకరించిందంటే ఆయన దైవభక్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

తన ప్రాణాలు లెక్కచేయకుండా శివాజీ చేసిన పోరాటాలు ఆయన దేశభక్తికి దర్పణం పడుతుంటాయి. ఇక శివాజీకి గల గురుభక్తి కూడా అందరినీ ఆశ్చర్యచకితులను చేసేది. 'సమర్థ రామదాసు' ని గురువుగా స్వీకరించిన శివాజీ ఆయన మాటకు ఎంతో విలువను ఇచ్చేవాడు. ఆయన సూచలను తూ.చ.తప్పకుండా పాటించేవాడు. పరిపాలనా సంబంధమైన విషయాలతో నిత్యం సతమతమైపోయే శివాజీ, ఏమాత్రం వీలుదొరికినా తన గురువైన సమర్థరామదాసుని కలుసుకుంటూ ఉండేవాడు. పరిపాలనా సంబంధమైన విషయాలతో పాటు, ఆధ్యాత్మికపరమైన విషయాలు కూడా వాళ్ల సంభాషణలో చోటుచేసుకుంటూ ఉండేవి.

సత్యానికీ ... ధర్మానికి కట్టుబడినవారికి విజయం తప్పదనే గురువు వాక్యాలే శివాజీకి మరింత ఆత్మస్థైర్యాన్ని కలిగించేవి. దాంతో ఆయన గురువు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ తాను అనుకున్న లక్ష్యాలను చేరుకునేవాడు. సమర్థ రామదాసు ఇచ్చిన వస్త్రాన్ని 'రాజ పతాకం' గా శివాజీ ఉపయోగించాడంటే, గురువు పట్ల శివాజీకి గల విశ్వాసం ఎంతటి బలమైనదో స్పష్టమవుతుంది. ఇలా దైవభక్తి ... దేశభక్తితో పాటు అసమామైన గురుభక్తిని కలిగివున్న కారణంగానే శివాజీ అనేక విజయాలను అవలీలగా సాధించగలిగాడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.


More Bhakti News