ఆదిదేవుడు చేసే అద్భుతమే ఇది !
అమర్ నాథ్ గుహలో ఆవిర్భవించే మంచు శివలింగాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో యాత్రికులు వెళుతుంటారు. మంచుకొండల నడుమ ఆవిష్కృతమయ్యే మహాశివలింగాన్ని చూడటానికి ఏడాదిలో రెండు నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆగస్టు తరువాత అమరలింగాన్ని చూడటానికి వాతావరణం అనుకూలించదు.
పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ గుహలోనే సృష్టి రహసాన్ని గురించి చెప్పాడని అంటారు. అందుకు ప్రతీకగానే ఇక్కడ మంచుతో మహాలింగం ఏర్పడుతోందని చెబుతారు. చంద్రకళలను అనుసరించి అమరలింగం పెరుగుతూ తగ్గుతూ ఉండటం జరుగుతుంది. అమరలింగాన్ని దర్శించుకోవడం వలన సాక్షాత్తు ఆదిదేవుడిని ప్రత్యక్షంగా దర్శించుకున్న ఫలితం కలుగుతుందని విశ్వసిస్తుంటారు.
ఈ కారణంగానే మంచుపర్వతాల మధ్య కష్టతరమైన బాటలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ యాత్రికులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. అమరాలింగాన్ని దర్శించాలనే ఆతృత ... ఆరాటం కారణంగా ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు. తోటి యాత్రికులుచేసే శివనామస్మరణ వలన కలిగే ఉత్సాహం ... ఉత్తేజం ఆ స్వామి సన్నిధికి చేరుస్తాయి.
ఇక్కడి గుహలో మంచుతో ఏర్పడిన అమరాలింగాన్ని దర్శించినవాళ్లు తమని తాము మరిచిపోతుంటారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఇక్కడి గుహలో మంచుశివలింగం మినహా మరెక్కడా మంచు అనేది కనిపించదు. గుహ గోడలకుగానీ ... పైకప్పులో గాని ... నేలబారున గాని మంచు అనేది కనిపించకపోవడం అమరనాథుడు చూపుతోన్న అద్భుతమైన మహిమకు నిదర్శనంగా యాత్రికులు చెప్పుకుంటూ ఉంటారు. గుహలో మహాలింగంగా ఆవిర్భవించిన మంచులింగాన్ని దర్శించుకున్న భక్తులు, మనోఫలకంపై ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకుంటారు. తమ జన్మ ధన్యమైందని భావిస్తూ .. అనుభూతితో తరిస్తూ అక్కడి నుంచి వెనుదిరుగుతుంటారు.