శివారాధన వలన కలిగే ఫలితం !

పరమశివుడు పరమదయాళువు ... తనపట్ల వ్యతిరేకత చూపిన తిన్నడు (కన్నప్ప)నీ ... మంజునాథుడిని ఆగ్రహించక సహనంతో తన దారికి తెచ్చుకున్నవాడాయన. తనని విశ్వసించిన అల్పాయుష్కుడైన మార్కండేయుడిని చిరంజీవిగా చేసి, తనపట్ల ప్రేమచూపిన 'గొడగూచి'ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నవాడాయన.

సమస్త జీవకోటికి ఆహారాన్ని అందిస్తూ ఆదిదేవుడు ఎంత తీరికలేకుండా వున్నా, భక్తులు ఆర్తితో పిలిస్తేచాలు ఆయన క్షణమైనా ఆలస్యం చేయడు. పిలిస్తే పలుకుతాడు ... పూజిస్తే పుణ్యరాశిని పెంచుతాడు గనుకనే, భక్తులు ఆ దేవదేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే సోమవారం రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.

కొంతమంది భక్తులు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపించి పూలు - పండ్లు సమర్పిస్తూ ఉంటారు. మరికొందరు పూజా మందిరంలో చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అనునిత్యం పూజాభిషేకాలు చేస్తుంటారు. ఆయనకి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక విశేషమైన రోజుల్లో సదాశివుడు ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శిస్తూ సదా ఆయన అనుగ్రహాన్ని కోరుతుంటారు.

సదాశివుడికి పూజాభిషేకాలు నిర్వహించడం వలన సమస్త పాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయి. ఆ స్వామిని అనునిత్యం పూజించడం వలన ... ఆరాధించడం వలన, శని దోష ప్రభావం కూడా తగ్గుతుందని చెప్పబడుతోంది. శనిదోషం తగ్గడం కోసం ... సకలశుభాలను పొందడం కోసం అనుదినం సదాశివుడిని అర్చించడం మరచిపోకూడదు.


More Bhakti News