పుష్యమాసంలో సూర్యారాధన ఫలితం !

సకల చరాచర జగత్తుకి జీవనాధారం సూర్యభగవానుడు. వెలుగురేఖలతో లోకాలను కాంతివంతం చేస్తూ , జీవులకు చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అలాంటి సూర్యభగవానుడిని కాలాధిపతిగా ... గ్రహాధిపతిగా ... ప్రత్యక్ష నారాయణుడిగా సేవించడమనేది ప్రాచీనకాలం నుంచి ఉంది.

సమస్త జీవులు సూర్యోదయంతోనే చైతన్యవంతమై, ఆ శక్తితో తమకి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. ప్రకృతి ద్వారా సూర్యభగవానుడు జీవులకు కావలసిన ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. ఆ ప్రకృతిపై ఆధారపడి జీవిస్తోన్న మానవాళి, సూర్యభగవానుడికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది.

దేవతలు ... మహర్షులు ... మహారాజులు సూర్యుడిని ఆరాధించి తరించిన తీరు మనకి పురాణాల్లోను ... ఇతిహాసాల్లోను కనిపిస్తుంది. అలాగే చర్మసంబంధమైన వ్యాధుల బారినపడినవాళ్లు ఆ స్వామి అనుగ్రహంతో రోగవిముక్తులైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సూర్యభగవానుడిని అనునిత్యం స్మరించడం వలన సమస్తపాపాలు నశించిపోతాయి. ముఖ్యంగా పుష్యమాసంలో సూర్యభగవానుడి ఆరాధన మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.

ఈ మాసంలో పంటలు ఇంటికి చేరుకోవడం వెనుక ఆయన అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో చలి ఎక్కువగా ఉండటం వలన వివిధరకాల రుగ్మతలకు గురికావడం జరుగుతుంది. అలాంటివాటి బారినపడకుండా ఉండటం కోసం సూర్యుడిని పూజించవలసిన అవసరం ఎంతో వుంది. పంటలను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ .. చలివలన వచ్చే రుగ్మతల నుంచి కాపాడమంటూ ఈ మాసంలో సూర్యభగవానుడిని పూజించాలి. ఇలా భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడిని ఆరాధించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News