భక్తుల వెన్నంటి వుండే శిరిడీసాయి
సాయిబాబా ఓ సాధారణ ఫకీరు కాదనీ ... దైవస్వరూపుడనే విషయం ఒక్కో సంఘటన ద్వారా ప్రజలకు అర్థంకాసాగింది. దాంతో ఆయనని కలుసుకుని తమ బాధలు చెప్పుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుండేవాళ్లు. అర్హతనుబట్టి బాబా వాళ్లను అనుగ్రహిస్తూ ఉండేవాడు.
ఒక రోజున బాబా దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు. బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటాడు. తాను చాలాదూరం నుంచి ఎంతో శ్రమకోర్చి వచ్చానని బాబాతో చెబుతాడు. బాబా నవ్వుతూ ఆయన బయలుదేరిన దగ్గర నుంచి శిరిడీ చేరుకునేంత వరకూ తనకి తెలుసని అంటాడు. బాబా అలా అనడంతో ఆ భక్తుడు ఆశ్చర్యచకితుడవుతాడు.
ఫలానా చోట ఆయనకి ఆకలిగా ఉన్నప్పుడు తోటి బాటసారిగా వున్న వ్యక్తి రొట్టె పెట్టిన విషయాన్నీ, వెంటతెచ్చుకున్న మంచినీళ్లు అయిపోయి మార్గమధ్యంలో ఆయన అవస్థపడుతుంటే మరో వ్యక్తి ఆయనకి మంచినీళ్లు అందించిన విషయాన్ని బాబా గుర్తుచేస్తాడు. వాళ్లు చేసిన సాయాన్ని తాను ఎన్నటికీ మరిచిపోలేనని ఆ భక్తుడు అంటాడు.
బాటసారిలా ఆయనవెంట నడుస్తూ దాహాన్నీ ... ఆకలిని తీర్చినది తానేనని చెబుతాడు బాబా. తన దర్శనం కోసం బయలుదేరినవాళ్లు తన సన్నిధికి చేరుకునేంతవరకూ తాను తోడుగానే ఉంటానని బాబా ఆయనని ఆప్యాయంగా స్పర్శిస్తాడు. కళ్లు ఆనందబాష్పాలను వర్షిస్తూ ఉండగా ఆ భక్తుడు బాబాకి నమస్కరిస్తూ ఆయన పాదాలపై వాలిపోతాడు.