చేసిన తప్పును సరిదిద్దుకోవలసిందే !
తప్పులు చేయడం మానవ సహజమని పెద్దలు అంటూ ఉంటారు. ఉద్దేశ పూర్వకంగా కాకపోయినా ఒక్కోసారి అనుకోకుండా తప్పు జరిగిపోతూ ఉంటుంది. అయితే కొంతమంది అది అనుకోకుండా జరిగిందే కదా అనుకుని తేలికగా తీసుకుంటూ ఉంటారు. మరికొందరు తెలియకచేసినా అది తప్పే కనుక దానిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు.
అలాంటి మంచిమనసున్న వారిలో 'సుకన్య' ముందువరుసలో కనిపిస్తుంది. మహారాజు కుమార్తె అయిన సుకన్య మహా సౌందర్యవతి. ఆమె అందచందాల గురించి అంతా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. అలాంటి సుకన్య అనుకోకుండా చేసిన ఒక పొరపాటు కారణంగా 'చ్యవన మహర్షి' కి చూపుపోతుంది. తన వలన జరిగిన తప్పుకు సుకన్య ఎంతగానో బాధపడుతుంది.
అసలే అడవిలోని ఆశ్రమంలో వుండే ఆయన పూజకు కావలసిన ఏ పనిని చేసుకోలేక నానాఅవస్థలు పడవలసి వస్తుందని భావిస్తుంది. చూపులేనివారికి భార్యస్థానంలో ఉన్నవారు తప్ప మరెవరూ అంతగా సేవచేయలేరని అనుకుంటుంది. తన కారణంగా చూపును కోల్పోయిన ఆయనని తాను వివాహం చేసుకుని తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటుంది.
ఈ విషయంలో తల్లిదండ్రులు ఎంతగా వారించినా ఆమె వినిపించుకోదు. తాను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని వారిని కోరుతుంది. అలా అంధుడైన చ్యవన మహర్షిని వివాహం చేసుకున్న సుకన్య, పతివ్రతలలో ముందువరుసలో కనిపిస్తుంది.