హనుమంతుడికి ప్రదక్షిణ చేస్తే చాలు !

తరచూ పీడకలలతో బాధలుపడుతున్నవాళ్లను ... మానసిక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లను హనుమంతుడి క్షేత్రాలకు తీసుకుని వెళుతుంటారు. హనుమంతుడికి ప్రదక్షిణలు ... ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన వాళ్లు ఆ బాధల నుంచి బయటపడతారని భావిస్తుంటారు.

అలాంటి విశ్వాసాన్ని అధికంగా కలిగిన హనుమంతుడు 'తమ్మర' లో కనిపిస్తాడు. నల్గొండ జిల్లా కోదాడ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ గ్రామంలో ప్రాచీనకాలంనాటి సీతారామచంద్రస్వామి ఆలయం దర్శనమిస్తుంది. చక్కని గోపురం ... పొడవైన ప్రాకారాలు ... రథశాల ... లోపలి ప్రాకార మంటపాలు ... ప్రధాన ద్వారానికి ఎదురుగా కల్యాణ మంటపం ... మరో ద్వారానికి ఎదురుగా కోనేరు ఆలయ వైభవానికి అద్దంపడుతుంటాయి.

ఇక్కడ సీతారామలక్ష్మణులను కనిపెట్టుకుంటూ గర్భాలయానికి ఎదురుగా ప్రత్యేక మంటపంలో హనుమంతుడు కొలువుదీరి కనిపిస్తుంటాడు. సిందూర వర్ణంలో కనిపించే ఇక్కడి హనుమంతుడు మహిమాన్వితుడని చెబుతారు. అనారోగ్యాలతోను ... పీడ కలలతోను బాధపడుతోన్నవాళ్లు ఇక్కడి హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తుంటారు. మండల కాలంపాటు ప్రతిరోజు తలస్నానం చేసి ... 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. ప్రతి మంగళవారం సిందూర అభిషేకం ... ఆకుపూజ చేయిస్తారు. ఫలితంగా స్వామి అనుగ్రహంతో పూర్వస్థితిని పొందినవాళ్లు ఎంతోమంది ఉన్నారని అంటారు.

ఇక్కడి హనుమంతుడిని ఆశ్రయించి కోతులు ఉండటం విశేషం. శ్రీరామనవమి ఉత్సవాలు ... హనుమజ్జయంతి సేవలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. ఈ ఆలయంలో అడుగుపెట్టిన భక్తులకు హనుమంతుడి అండదండలు ఎప్పటికీ ఉంటాయని చెబుతుంటారు. భక్తులకు స్వప్నదర్శనం ఇవ్వడం వలన ఆయన తన అనుగ్రహాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అందువలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావిస్తుంటారు


More Bhakti News