ధనుర్మాసంలో దర్శించవలసిన క్షేత్రం

గోవులను ... గోపాలకులను ... గోపికలను ... రేపల్లె వాసులను తన వేణుగానంతో కృష్ణుడు మంత్రముగ్ధులను చేసేవాడు. తమని తాము మరపించే ఆయన వేణుగానాన్ని వినడానికి అందరూ ఎంతగానో తపించేవారు. ఒకవైపున వేణుగానంతో వాళ్లను పరవశులను చేస్తూనే, మరోవైపున లోకకల్యాణం కోసం ఆయన అసురసంహారం చేస్తూ వచ్చాడు.

ధర్మాన్ని రక్షిస్తూ ... ధర్మ మార్గంలో నడచుకున్నవారిని విజయం తప్పక వరిస్తుందని కృష్ణుడు ఈ లోకానికి చాటిచెప్పాడు. కష్టాలను తీర్చువాడే కృష్ణుడు కనుక, అంతా తమ కష్టాలను చెప్పుకుంటూ ఆయన సాయాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల స్వామి ఆలయాలు అనేక ప్రాంతాలలో నిర్మించబడ్డాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'మఠంపల్లి' కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. సువిశాలమైన ఆలయంలో కొలువైన వేణుగోపాలుడి మనోహర రూపం చూసితీరవలసిందే. ఒకసారి చూస్తే చాలు మనోఫలకంపై ఆయన రూపం శాశ్వతంగా నిలిచిపోతుంది. స్వామివారిని అంకిత భావంతో సేవిస్తే, ఎలాంటి కష్టాలైనా కర్పూరంలా ఆవిరైపోతాయని చెబుతుంటారు. అడిగిన వరాలను ఆలస్యం చేయక అనుగ్రహిస్తాడని అంటారు.

స్వామివారి మహాత్మ్యం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉండటం వలన, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. స్వామి దర్శనం చేసుకుని తమ మనసులోని మాటను చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ధనుర్మాసంలో ఒక్కడ పూజాభిషేకాలు జరిపించడం వలన విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News