అఖండజ్యోతి వెలుగులో ఆదిదేవుడి దర్శనం
ప్రాచీన కాలంనాటి పుణ్యక్షేత్రాలను దర్శించిన భక్తులకు అగస్త్యమహర్షి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చాలా ప్రదేశాల్లో అగస్త్యమహర్షి శివలింగాలను ప్రతిష్ఠించడమే అందుకు కారణం. అగస్త్యమహర్షి అనేక ప్రాంతాలమీదుగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
ఈ ప్రయాణంలో భాగంగా ఆయన అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి పూజాభిషేకాలు నిర్వహించాడు. ఈ కారణంగానే చాలా ప్రదేశాల్లో అగస్త్యేశ్వర ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. అలా ఆయన పేరుతో పిలవబడుతోన్న ఆలయం ఒకటి 'చెన్నూరు' లో అలరారుతోంది. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 'అఖండ జ్యోతి'ని కలిగి ఉండటం ఈ క్షేత్రం యొక్క విశేషంగా చెబుతుంటారు.
గర్భాలయంలోని అఖండ జ్యోతి కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతూ వస్తుందని చెబుతుంటారు. తరతరాలుగా ఈ అఖండ జ్యోతిని అర్చకస్వాముల వంశీకులే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అఖండజ్యోతి వెలుగులో అగస్త్యేశ్వరుడిని దర్శించడం వలన సమస్త పాపాలు నశించి సకలశుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. తరతరాలుగా వెలుగుతోన్న అఖండజ్యోతికి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉండటం విశేషం.