అందుకే శనిదేవుడు కాస్త శాంతించాడట !
ఎవరైనా తమ జీవితం ఆనందంగా ... హాయిగా సాగిపోవాలని కోరుకుంటారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురుకాకుండా సుఖశాంతులతో ఉండాలని అనుకుంటారు. అలాంటివాళ్లు తమ జీవితంలోకి 'శని' ప్రవేశించాడని తెలిస్తే తీవ్రమైన ఆందోళనకి లోనవుతారు. ఎలాంటి కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడతారు.
సాధ్యమైనంత తొందరగా శని బారినుంచి బయటపడాలనే ఉద్దేశంతో వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అలా శనిబారిన పడినవాడుగా 'పిప్పలాదుడు' కనిపిస్తాడు. బాల్యంలోనే అనేక కష్టనష్టాలను అనుభవించిన ఆయన, ఆ తరువాత కాలంలో మహర్షిగా మారతాడు. బాల్యంలో తనని అనేక బాధలకు గురిచేసిన శనిగ్రహంపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. తన తపోశక్తితో గ్రహమండలం నుంచి శనిగ్రహాన్ని తప్పిస్తాడు.
అయితే ఈ విషయంలో బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని పిప్పలాదుడికి నచ్చజెబుతాడు. బాల్యదశ దాటేంతవరకూ శని ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపకూడదని పిప్పలాదుడు పట్టుబట్టడంతో అందుకు శనిదేవుడిని బ్రహ్మదేవుడు ఒప్పిస్తాడు. సాధారణంగా శనిదేవుడు పట్టుకోవడమంటూ జరిగితే ఏడున్నర సంవత్సరాల వరకూ వదలడని అంతా ఆందోళన చెందుతుంటారు.
నిజానికి అంతకుముందు ఆయన సుదీర్ఘ కాలంపాటు పట్టుకుని పీడించేవాడట. విక్రమాదిత్యుడి అభ్యర్థన మేరకే ఆయన తాను పట్టుకునుండే కాలాన్ని ఏడున్నర సంవత్సరాలకి తగ్గించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా పిప్పలాద మహర్షి ... విక్రమాదిత్యుడి కారణంగా శనిదేవుడు తన ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించడం జరిగిందని అంటారు.