రథోత్సవం కూడా వరాలనిస్తుంది !
కరుణించే దేవుడుగా ... కష్టాలను తీర్చే దయామయుడుగా వేంకటేశ్వరుడు కనిపిస్తుంటాడు. వేంకటేశ్వరా అని పిలుచుకోవడంలోనే మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. పసిడికాంతుల మధ్య వైభవంతో వెలుగొందుతూ ఉండే స్వామి, భక్తుడు పిలిచే ఒకే ఒక పిలుపుతో అవన్నీ వదులుకుని పరిగెత్తుకు వస్తాడు. ఆపదలో ఉన్న భక్తుడిని ఆదుకోవడంలో కలిగే ఆనందంకన్నా మరేదీ ఎక్కువ కాదన్నట్టుగానే ఆ స్వామి వ్యవహరిస్తూ ఉంటాడు.
ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తే చాలు, కష్టాలను మరిచిపోవచ్చనే ఉద్దేశంతో భక్తులు ఆయన ఆలయాలకు వెళుతుంటారు. ఈ కారణంగానే వేంకటేశ్వరస్వామి ఆలయాలు అనునిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటి కృష్ణాజిల్లా 'తిరువూరు'లో దర్శనమిస్తుంది. శ్రీదేవి - భూదేవి సమేతుడుగా కొలువుదీరిన ఇక్కడి స్వామివారిని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.
ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి. 'ముక్కోటి ఏకాదశి' రోజున ... మాఘపౌర్ణమి సందర్భంగా జరిగే కల్యానోత్సవాల్లో భాగంగా స్వామివారికి 'రథోత్సవం' జరుగుతుంటుంది. ఈ రథోత్సవం విశేషమైనదిగా భక్తులు చెబుతుంటారు. వేలాదిగా భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ .. అనుసరిస్తూ వస్తారు. ఇలా స్వామివారి వైభవంలో పాల్గొనడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
స్వామివారి రథోత్సవంలో పాల్గొనడం వలన వివాహయోగం ... సంతాన భాగ్యం కలుగుతాయని చెబుతారు. అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు దూరమవుతాయని అంటారు. అందువల్లనే ఇక్కడి రథోత్సవంలో పాల్గొనడానికిగాను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఆ స్వామివారి వైభవాన్ని కనులారా తిలకించి ఆయన ఆశీస్సులను అందుకుంటూ ఉంటారు.