అలా భగవంతుడు ముచ్చట తీర్చుకుంటాడు
భగవంతుడిని సేవించడంలోను ... ఆయనని పూజించడంలోను మహాభక్తులు అనంతమైన ఆనందాన్ని పొందుతుంటారు. స్వామి సన్నిధిలో వుంటూ అనుక్షణం ఆయనని ఆరాధించడంకన్నా తమకి మరేదీ అవసరం లేదన్నట్టుగానే వాళ్లు వ్యవహరిస్తుంటారు . అలాంటి మహాభక్తులకు స్వామి విశేషమైన స్థానాన్ని కల్పిస్తుంటాడు.
అలా స్వామితో శాశ్వతమైన అనుబంధాన్ని పొందిన భక్తులలో 'విష్ణుచిత్తుడు' ముందువరుసలో కనిపిస్తాడు. విల్లిపుత్తూరులో పుట్టి పెరిగిన విష్ణుచిత్తుడికి రంగనాథస్వామిపట్ల అసమానమైన భక్తిశ్రద్ధలు ఏర్పడతాయి. ఉదయాన్నే నిద్రలేచి .. తుమ్మెదలు కూడా వాలని పూలను కోసి ఆయన స్వామివారికి మాలగా కట్టి సమర్పించేవాడు. భగవంతుడికి పూల మాలకట్టడంలో గల అనిర్వచనీయమైన అనుభూతికి మరేదీ సాటిరాదని ఆయన భావించేవాడు.
తాను అల్లిన పూలమాల రంగనాథస్వామి హృదయాన్ని తాకిన ప్రతిసారి తన జన్మ ధన్యమైందన్నట్టు ఆయన సంతోషంతో పొంగిపోయేవాడు. తన వైభవాన్ని చూసి ముచ్చటపడే విష్ణుచిత్తుడికి స్వామివారు రాజసత్కారం లభించేలా చేస్తాడు. భక్తుడికి జరుగుతోన్న ఆ సత్కారాన్ని చూడటానికి స్వామివారు అక్కడికి వస్తాడు. విష్ణుచిత్తుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చి ఆయనకి సంతోషాన్ని కలిగిస్తాడు.
ఇక తన స్వామిపట్ల విష్ణుచిత్తుడు చూపే భక్తిశ్రద్ధలకు లక్ష్మీదేవి కూడా ఎంతగానో ఆనందపడుతుంది. విష్ణుచిత్తుడి జీవితాన్ని చరితార్థం చేయడం కోసం ఆయన కూతురుగా 'గోదాదేవి' పేరుతో పెరుగుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవికి తండ్రి స్థానాన్ని పొందిన విష్ణుచిత్తుడు, ఇంతకుమించిన భాగ్యం ఇంకెవరి దక్కుతుందంటూ పరవశాన్ని పొందుతాడు. రంగనాథస్వామి ఆదేశం మేరకు ఒక తండ్రిగా అమ్మవారిని ఆయన చేతుల్లో పెడతాడు. అంకితభావంతో భక్తుడు గోరంత సేవచేసుకుంటే భగవంతుడు కొండంత అనుగ్రహాన్ని చూపిస్తాడనటానికి విష్ణుచిత్తుడి జీవితం నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తూ ఉంటుంది.