ఇష్టాలు నెరవేర్చే ఇష్టకామేశ్వరీ
జగన్మాత అయిన అమ్మవారు అనేక నామాలతో ... రూపాలతో వివిధ ప్రాంతాలలో ఆవిర్భవించింది. ఆ తల్లి కొలువుదీరిన క్షేత్రాలు ఎంతో ప్రత్యేకతను ... ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అమ్మవారు ఎక్కడ వెలసినా భక్తుల ఆ తల్లిని దర్శించుకుని ఆమె చల్లని ఆశీస్సులను కోరుతూనే ఉంటారు.
తమ సంతాన సౌభాగ్యాలు కళకళలాడుతూ ఉండటానికి కారణం ఆ తల్లి అనుగ్రహమేనని భక్తులు చెబుతుంటారు. అంతటి విశ్వాసాన్ని పొందిన అమ్మవారి క్షేత్రాలలో ఒకటి 'గోపాలాయపల్లి' సమీపంలో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం పరిధిలో గల 'శ్రీవారిజాల వేణుగోపాలస్వామి' కొండపైనే అమ్మవారు ఆవిర్భవించింది.
ఇక్కడి అమ్మవారు 'ఇష్టకామేశ్వరి' గా పూజలు అందుకుంటోంది. కొండరాళ్ల మధ్య వెలసిన అమ్మవారి దగ్గరికి చేరుకోవడం కొంచెం కష్టమైన పనే. అమ్మవారి సన్నిధిలో ఒక అందమైన కొలను కనిపిస్తుంది. ఇందులోని కలువలను అమ్మవారే కోస్తుందని చెబుతుంటారు. రాత్రి సమయాలందు అమ్మవారు ఇక్కడ తిరుగుతూ ఉంటుందని అంటారు. ఈ కారణంగా అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైవుందని భావిస్తుంటారు. ఆ తల్లిని దర్శించుకుని మనస్పూర్తిగా పూజిస్తే మనసులోని కోరికలు అనతికాలంలో నెరవేరతాయని చెబుతారు.
ఇక్కడే అయిదు స్వయంభువు శివలింగాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. ఇది ప్రాచీనమైన ... మహిమాన్వితమైన క్షేత్రమనడానికి ఇవి అద్దంపడుతుంటాయి. పంచముఖుడైన శివుడికి ప్రతీకగా ఈ పంచలింగాలు కనిపిస్తుంటాయి. అమ్మవారితో పాటు ఆదిదేవుడి దర్శనం చేసుకున్న భక్తులు ఆనందానుభూతులు ... సకల శుభాలను పొందుతుంటారు.