వ్యాధులను నివారించే దివ్యతీర్థాలు

సాధారణంగా ఏ క్షేత్రానికి వెళ్లినా ముందుగా అక్కడి తీర్థంలో భక్తులు స్నానం చేస్తుంటారు. ఆ తరువాతనే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి దైవదర్శనానికి వెళుతుంటారు. ఈ తీర్థాలలో స్నానం చేయడం వలన శరీరం ... మనసు పవిత్రం కావడం మాత్రమే కాదు, మనోభీష్టం కూడా నెరవేరుతుందని చెప్పబడుతోంది.

భగవంతుడి సంకల్పం కారణంగా ఏర్పడిన ఆయా తీర్థాలు అవి ఆవిర్భవించిన సందర్భాన్నిబట్టి వివిధరకాల విశేషాలను సంతరించుకుని కనిపిస్తుంటాయి. కొన్ని తీర్థాలు ఆయురారోగ్యాలను ... మరికొన్ని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయని అంటారు. ఇంకొన్ని తీర్థాలు మనసులోని కోరికలను నెరవేరుస్తాయని చెబుతారు. అలాంటి దివ్యతీర్థాలలో గోమతీ తీర్థం ... చక్రతీర్థం కూడా కనిపిస్తుంటాయి. విశేషమైన ఈ రెండు తీర్థాలు 'నైమిశారణ్యం'లో దర్శనమిస్తాయి.

పురాణాలలోను ... ఇతిహాసాలలోను ప్రస్తావించబడిన నైమిశారణ్యం మహా పుణ్యస్థలిగా చెప్పబడుతోంది. ఎందరో మహర్షుల పాదస్పర్శచే ఈ ప్రదేశం మరింత పవిత్రమైంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు తప్పనిసరిగా ఇక్కడి తీర్థాలలో స్నానం చేస్తుంటారు. గోమతీ తీర్థంలో స్నానం చేసిన భక్తులు ఆ తరువాత చక్రతీర్థంలో స్నానం చేస్తుంటారు. ఈ దివ్య తీర్థాలలో స్నానం చేయడం వలన వివిధరకాల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News