పుష్యమాసంలో ఈ దానం ఎంతో మంచిది
ఈ జన్మలో అనుభవిస్తోన్న భోగభాగ్యాలు వచ్చే జన్మని ఏవిధంగాను ప్రభావితం చేయలేవు. సిరిసంపదల కారణంగా లభించే సుఖసంతోషాలకు కొనసాగింపుగా వచ్చేజన్మ ఉండదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యకార్యాల ఫలితాలనే వచ్చే జన్మలో అనుభవించడం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాల్లో ఎలా జాగ్రత్త పడటం జరుగుతుందో, అలాగే వచ్చే జన్మను గురించిన ఆలోచనచేస్తూ పుణ్యకార్యాలు చేయాలని చెప్పబడుతోంది. రానున్న జన్మలో ఏ జీవిగా జన్మిచ్చినా ఆహార కొరత ... నీటి కొరత రాకుండా, చలి .. ఎండా .. వాన .. కారణంగా అవస్థలు పడకుండా ఉండాలంటే దానధర్మాలతో ఈ జన్మను సార్థకం చేసుకోవలసి ఉంటుంది.
ఏదైతే దానం చేయడం జరుగుతుందో అది అనేకరెట్లు అధికమై వచ్చేజన్మలో లభిస్తుందని చెప్పబడుతోంది. అందుకే ఆయా వ్రత నియమాలలో ... పూజా విధానాలలో ... కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దానాల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. భూ దానం .. గోదానం .. సువర్ణ దానం .. వస్త్ర దానం ... అన్నదానం ఇలా కొన్ని విశిష్టమైన దానాలు ఈ జాబితాలో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని దానాలను పరిశీలిస్తే ఆయా మాసాలను దృష్టిలో పెట్టుకునే పెద్దలు ఆ విధమైన ఏర్పాట్లు చేశారనే విషయం స్పష్టమవుతుంది.
ఇక 'పుష్య మాసం' విషయానికి వచ్చేసరికి ఈ నెలలో 'వస్త్రదానం' చేయాలని చెప్పబడుతోంది. ఈ మాసంలో చలి అధికంగా ఉండటం వలన నిరుపేదలు ... నిరాశ్రయులు ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికి వస్త్రాలను దానం చేయడం వలన లభించే పుణ్యఫలితం విశేషంగా ఉంటుంది. వచ్చేజన్మలో చలి వలన బాధపడకుండా ఈ దాన ఫలితం కాపాడుతుంది. శివకేశవులు విశిష్ట ఫలితాలనిచ్చే ఈ మాసంలో అవకాశం ఉన్నంత వరకూ వస్త్రదానం చేయడం మరచిపోకూడదు.