కరుణ కురిపించే శిరిడీ సాయినాథుడు
బాబా మశీదులో వున్న రోజుల్లోనే శిరిడీ ప్రజలతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హాయిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్లు. తమకి కష్టమొచ్చినా నష్టమొచ్చినా చెప్పుకోవడానికి బాబా ఉన్నాడనే భరోసాతో వాళ్లంతా ధైర్యంగా ఉండేవాళ్లు.
ఆ విశ్వాసానికి తగినట్టుగానే వాళ్ల బాధలను బాబా స్వీకరిస్తూ ... బాధ్యతల నిర్వహణలో వాళ్లకి సహకరిస్తూ ఉండేవాడు. సమాధి చెందిన తరువాత కూడా బాబా తన భక్తులకు ఎలాంటి లోటు రానీయకుండా చూస్తుండటం విశేషం. రోజు రోజుకీ భక్తుల అనుభవాలుగా ఆయన మహిమలు పెరుగుతూ వస్తున్నాయి. అనేక ప్రాంతాలలో పెరుగుతోన్న బాబా ఆలయాల నిర్మాణమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
అలా భక్తుల సంకల్పంతో అలరారుతోన్న బాబా ఆలయాలలో ఒకటి వరంగల్ జిల్లా హనుమకొండలో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం బాబాపట్ల భక్తులకు గల భక్తి విశ్వాసాలకి కొలమానంగా కనిపిస్తుంది. భారీనిర్మాణంగా కనిపించే ఈ ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. వేదికపై గల బాబా కరుణాసాగరుడిగా కనిపిస్తుంటాడు. ఆయన చూపులు హృదయాన్ని ఆప్యాయంగా తాకుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన చిరునవ్వు ఓదార్పునిచ్చి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
గురువారాల్లో ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రత్యేక సేవలు ... భజనలు ... పారాయణాలతో ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. మనసుని బాధించే ఏ కష్టమైనా ఇక్కడి బాబాకు చెప్పుకుంటే అది వెంటనే తీరిపోతుందని భక్తులు చెబుతుంటారు. అలా ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ... సంతాన సౌభాగ్యాలను ఆయన భక్తులకు ప్రసాదిస్తూ ఉంటాడనీ, వాళ్ల సంతోషాన్ని చూస్తూ ఆయన సంతృప్తి చెందుతూ ఉంటాడని అంటారు.