ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆదిదేవుడు
తెలంగాణ ప్రాంతంలో ప్రాచీనకాలంనాటి శివాలయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ శైవక్షేత్రాలలో అడుగుపెట్టగానే ఆలయ నిర్మాణశైలిని బట్టి, శివలింగ ఆకృతిని బట్టి అది కాకతీయుల కాలంనాటిదనే విషయం అర్థమైపోతుంటుంది. అలనాటి కాకతీయుల శివభక్తికి నిదర్శనంగా ఈ క్షేత్రాలు దర్శనమిస్తుంటాయి.
స్థలమహాత్మ్యాన్ని గుర్తించే వాళ్లు ఆలయాల నిర్మాణాన్ని జరిపారని అంటారు. అందువలన వారి కాలంలో నిర్మించబడిన శివాలయాలు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను సంతరించుకుని వైభవంతో వెలుగొందుతున్నాయి. అలాంటి శైవక్షేత్రాల్లో ఒకటి 'దిర్శించర్ల' లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఆదిదేవుడు ఇక్కడ 'రామలింగేశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.
ఇక్కడి స్థలమహాత్మ్యం గురించీ ... పరమశివుడి లీలావిశేషాలను గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తుంటాయి. ఆయురారోగ్యాలను అందించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతని చెబుతుంటారు. అనారోగ్యంతో బాధపడుతోన్నవాళ్లు ఇక్కడి స్వామివారిని దర్శించి పూజిస్తేచాలు, అనతికాలంలోనే ఆ బాధల నుంచి బయటపడతారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఎంతోమంది అనుభవాలు కూడా ఇక్కడ వినిపిస్తుంటాయి.
ప్రతి సోమవారంతో పాటు పర్వదినాల్లో స్వామివారికి పూజాభిషేకాలు జరిపించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులను పొందుతుంటారు. ఇది మహిమాన్వితమైన క్షేత్రమనీ ... అందువల్లనే అనారోగ్యాలు నివారించబడుతున్నాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.