సద్గురువు అనుగ్రహానికి మించినది లేదు
జీవితాన్ని కష్టనష్టాలు అతలాకుతలం చేస్తుంటాయి. అనుకోకుండా వచ్చే ఆపదలు ... పరిష్కారమార్గాన్ని కూడా ఆలోచించుకునే సమయమివ్వని సమస్యలు వచ్చి మీదపడుతుంటాయి. అలాంటి పరిస్థితుల నుంచి సద్గురువుపట్ల గల విశ్వాసమే గట్టెక్కిస్తుంది.
సద్గురువు పాదాలను అంకితభావంతో ఆశ్రయిస్తే ఇక ఆయన ఆ భక్తులను ఎలాంటి పరిస్థితుల్లోను వదిలిపెట్టడు. వాళ్లకి ఎలాంటి లోటు రానీయకుండా చూస్తూ .. వాళ్ల సంతానసౌభాగ్యాలు నిలిచిఉండేలా చేస్తుంటాడు. ముఖ్యంగా తనని నమ్ముకున్నవాళ్ల సంతానాన్ని సద్గురువులు సదాకాపాడుతూ ఉంటారనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి.
ఒకసారి శిరిడీలోని మశీదులో కూర్చున్న బాబా, హఠాత్తుగా తన ఎదురుగా ఉన్న ధునిలో చేయిపెట్టి అందులోని నిప్పుకణికలను పైకి చిమ్ముతాడు. ఆ సమయంలో అక్కడున్న వాళ్లంతా, ఆయనలా ఎందుకు చేశాడో అర్థంకాక అయోమయానికి లోనవుతారు. ఆ పక్కనేగల గ్రామంలో ఆయన భక్తురాలి పసిబిడ్డ 'కొలిమి'లో పడబోతుండగా ఆయన అలా రక్షించాడనే విషయం వాళ్లకి ఆ తరువాత తెలుస్తుంది.
అలాగే ఒకసారి రాఘవేంద్రస్వామి తన భక్తుడి అభ్యర్థన మేరకు శిష్యులతో కలిసి ఆయన ఇంటికి భోజనానికి వస్తాడు. భోజనాల్లో వడ్డించడం కోసం ఆ ఇంటివాళ్లు ఒక గంగాళంలో తీపిపదార్థాన్ని కలుపుతారు. బాలుడైన వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఆ గంగాళంలోపడి చనిపోతాడు. స్వామి భోజనం చేయకుండా వెళ్లిపోతాడేమోననే ఉద్దేశంతో ఆ దంపతులు ఆ విషయాన్ని దాచి దుఃఖాన్ని దిగమింగుకుంటారు. అయినా విషయాన్ని గ్రహించిన స్వామి ఆ బాలుడిని బతికించి ఆ దంపతులకు సంతోషాన్ని కలిగిస్తాడు.
ఇక నృసింహసరస్వతి కూడా ఒక తల్లికి పుత్రశోకం లేకుండా చేసిన సంఘటన మనకి 'గురుచరిత్ర' లో కనిపిస్తుంది. తన బిడ్డ చనిపోవడాన్ని ఒక తల్లి జీర్ణించుకోలేకపోతుంది. నృసింహసరస్వతిని నమ్ముకున్న తనకి పుత్రశోకం కలిగే అవకాశమే లేదంటూ, ఖననం చేయడానికి ఆ బిడ్డను ఇవ్వకుండా హత్తుకుని కూర్చుంటుంది. తనపట్ల ఆమెకి గల విశ్వాసానికి ఆనందించిన స్వామి, ఆ బిడ్డకు ప్రాణంపోసి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతాడు. ఇలా ఎంతోమంది సద్గురువులు ఆపదలు ... ఆవేదనలనేవి తమ భక్తుల దరిచేరకుండా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. ఆ భక్తుల మనసు మందిరాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుని పూజలందుకుంటున్నారు.