ఇక్కడి గణపతికి గరిక సమర్పిస్తే చాలు !

జీవితం సుఖసంతోషాలతో సాగిపోవాలంటే తలపెట్టిన కార్యాలు అనుకున్న ప్రకారం జరిగిపోవాలి. అలా ఆటంకాలు లేకుండా పనులు జరగాలంటే అందుకు గణపతి అనుగ్రహం ఉండాలి. ఆయన ఆశీస్సులు పొందాలంటే భక్తిశ్రద్ధలతో పూజించాలి ... ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి. అప్పుడు ఆయన సంతృప్తిచెంది అనుగ్రహిస్తాడని అంటారు.

పిల్లల నుంచి పెద్దలవరకూ గణపతి అందరి పూజలను ఆనందంగా స్వీకరిస్తాడు. వాళ్లకు కావలసినవి సంతోషంగా అందిస్తాడు. ఈ కారణంగానే గణపతి దేవాలయాలు ఎప్పుడూ భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. వినాయకచవితిని జరుపుకునే భక్తులను చూస్తే, ఆ స్వామిపట్ల భక్తులకు గల విశ్వాసం ఎంత బలమైనదో స్పష్టమవుతుంది.

సాధారణంగా వినాయకచవితి రోజున మాత్రమే గణపతిని 'గరిక'తో పూజించడం జరుగుతూ ఉంటుంది. గరిక ఇచ్చే చల్లదనమంటే ఆయనకి ఎంతో ఇష్టమట. అందువలన దానితో పూజిస్తే ఆయన ఎంతగానో ప్రీతి చెందుతాడనేది మహర్షుల మాట. సాధారణమైన రోజుల్లో గణపతిని వివిధరకాల పుష్పాలతోనే పూజిస్తుంటారు. అయితే ఒక క్షేత్రంలో మాత్రం వినాయకచవితి రోజున మాత్రమే కాదు, అనునిత్యం గరికతోనే గణపతిని పూజిస్తుంటారు.

అలా నిత్యం గరికతో పూజలు అందుకునే గణపతి 'ఆసిఫాబాద్' లో కనిపిస్తాడు. లక్ష్మీగణపతిగా స్వామివారు పూజాభిషేకాలు అందుకునే ఈ క్షేత్రం, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అలరారుతోంది. ఒకానొక సమయంలో ఇక్కడి ప్రజలకి ఇబ్బందులు ఎదురైనప్పుడు, తమకి సుఖశాంతులు ప్రసాదించమని కోరుతూ అంతా ఆ స్వామిని గరికతో అర్చించారట. ఫలితంగా వాళ్లు ఆశించిన ప్రయోజనం నెరవేరడంతో, స్వామి మహిమాన్వితుడనే విషయం భక్తులకు స్పష్టమైపోయింది.

ఆ రోజు నుంచి ఇక్కడి గణపతిని గరికతోనే పూజిస్తూ ఉంటారు. ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతినిత్యం ఇరవై ఒక్క గరికతో స్వామివారిని పూజించడం వలన మనోభీష్టం తప్పక నెరవేరుతుందని భక్తులు బలంగా చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా తమ అనుభవాలను ఆవిష్కరిస్తుంటారు. వినాయక చవితితో పాటు సంకటహర చతుర్థి రోజున జరుగే ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఆ స్వామి ఆశీస్సులతో విజయాలను పొందుతుంటారు.


More Bhakti News