భక్తుడు కరుణిస్తే దైవం అనుగ్రహించినట్టే !
మహాభక్తులకు భగవంతుడి నామాన్ని స్మరించడం ... ఆయన పాదాలను సేవించడం మినహా మరోధ్యాస ఉండదు. తాము నమ్ముకున్న దైవాన్ని నిరంతరం స్మరిస్తూ ... కీర్తిస్తూ వాళ్లు పరవశించిపోతుంటారు. భగవంతుడిని ఆరాధించడం తప్ప ఎవరికీ ఎలాంటి హాని చేయని భక్తులకు కూడా అసూయాపరుల బాధలు తప్పలేదు.
అసూయాపరులు ఎన్నివిధాలుగా ఇబ్బందులు పెట్టినా ... ఎంతగా కష్టపెట్టినా వాళ్లు తమ సహనాన్ని విడిచిపెట్టలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో అసూయాపరులు తమ పాదాలను ఆశ్రయించినప్పుడు వాళ్లను క్షమించి తమ పెద్దమనసును చాటుకున్నారు. తులసీదాస్ ను 'రవిదత్తుడు' అనే వ్యక్తి ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉండేవాడు. అవకాశం దొరికితేచాలు ఆయనని నలుగురిలో అవమానించడానికి సిద్ధపడుతూ ఉండేవాడు.
ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తులసీదాసు ఆశ్రమానికి నిప్పు పెట్టి శ్రీరాముడికి ఆగ్రహాన్ని కలిగిస్తాడు. తులసీదాసు క్షమించడంతో బతికి బయటపడతాడు. ఇక తుకారామ్ ని కూడా 'ముంభాజి' అనే వ్యక్తి ఎప్పుడూ వేధిస్తూ ఉండేవాడు. ఆ పాపానికి ఫలితంగా ఆయన అంగవైకల్యాన్ని పొందుతాడు. పశ్చాత్తాపంతో తుకారామ్ పాదాలను ఆశ్రయించి, ఆయన కరుణించడంతో పూర్వస్థితిని పొందుతాడు.
ఇక త్యాగయ్య విషయానికి వస్తే ఆయనకి సోదరుడి నుంచే ఇబ్బందులు ఎదురవుతాయి. త్యాగయ్య సోదరుడు డబ్బుకి కక్కుర్తిపడే భార్య మాటలు విని తమ్ముడికి ద్రోహం తలపెడతాడు ... ఫలితంగా తన చేతిని కోల్పోతాడు. తాను చేసిన పాపాన్ని గురించి త్యాగయ్యతో చెప్పి ఆయన కన్నీళ్ల పర్యంతమవుతాడు. త్యాగయ్య క్షమించడంతో రాముడి అనుగ్రహం లభించి ఆయన పూర్వస్థితిని పొందుతాడు.
ఇలా ఎంతోమంది భక్తులు అసూయపరుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కున్నారు. అయినా వాళ్ల పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేయకుండా కరుణించారు. ఆ మహాభక్తుల అభ్యర్థన కారణంగానే భగవంతుడు శాంతించి క్షమిస్తూ వచ్చాడు. అలాంటివారి విషయంలో తన భక్తుల కోరికను మన్నిస్తూ వచ్చాడు.