ఆదిదేవుడికి ఆవునెయ్యితో అభిషేకం

ఆదిదేవుడు అభిషేకప్రియుడు ... దోసెడు నీళ్లతో అభిషేకిస్తేచాలు, సముద్రమంతటి వరాలను సంతోషంగా ప్రసాదిస్తాడు. అంకితభావంతో బిల్వపత్రాలను సమర్పిస్తే చాలు అష్టైశ్వర్యాలను అందిస్తాడు. అందుకే ఆ స్వామిని అభిషేకించడానికి అందరూ ఆరాటపడుతుంటారు ... పూజించడానికి ఆతృతపడుతుంటారు.

సాధారణంగా ఆదిదేవుడిని దర్శించుకున్న భక్తులు ఆయనని ఆవుపాలు ... ఆవుపెరుగు ... ఆవునెయ్యి ... తేనె ... చెరుకు రసం ... వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకిస్తూ ఉంటారు. ఆయనని ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఒక్కోమాసంలో ఒక్కో అభిషేక ద్రవ్యం విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. విశేషమైన పుణ్యఫలితాలను ఇస్తుందని స్పష్టం చేయబడుతోంది.

అలా పుష్యమాసం విషయానికి వస్తే, ఈ మాసంలో పరమశివుడిని 'ఆవునెయ్యి' తో అభిషేకించడం మంచిదని చెప్పబడుతోంది. పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు సదాశివుడు కూడా భక్తులచే విశేషంగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తిశ్రద్ధలకు తగినట్టుగా వాళ్లను అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రీమహావిష్ణువుకు అలంకారం జరుగుతున్నప్పుడు మనసుకు ఎంతటి ఆనందం కలుగుతుందో, శివయ్యకి అభిషేకం జరుగుతున్నప్పుడు అంతటి సంతోషం కలుగుతుంది. అలాంటి శివయ్యని ఈ మాసంలో ఆవునెయ్యితో అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలితాలు కలుగుతాయి .. సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News