గోదాదేవి ఇక్కడే అవతరించింది !
శ్రీవిల్లి పుత్తూరు అనగానే గోదాదేవి గుర్తుకువస్తుంది ... మధురభక్తితో ఆమె రంగనాయకస్వామిని సేవించిన తీరు కనులముందు కదలాడుతుంది. ఆ స్వామిని కీర్తిస్తూ ఆమె గానం చేసిన పాశురాలు లీలగా వినిపిస్తుంటాయి. అసమానమైన భక్తితో రంగనాథుడినే తన నాథుడిని చేసుకున్న ఆమె ఎంతటి ధన్యురాలని కొందరు అనుకుంటారు. సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి అంశనే కదా అని మరికొందరు అంటారు.
ఆండాళ్ అంటూ ఆప్యాయంగా పిలిపించుకునే గోదాదేవి, విల్లిపుత్తూరులో నివసిస్తోన్న విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడికి తులసివనంలో లభిస్తుంది. ఇక ఈ ఊరుకి ఈ పేరు రావడానికి వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ వినిపిస్తుంది. పూర్వం ఈ ప్రాంతం విల్లి - కంఠన్ అనే సోదరుల ఏలుబడిలో ఉండేది. ఒకసారి వాళ్లిద్దరూ అడవిలో వేటకి వెళతారు. పులిని వేటాడుతూ వెళ్లిన కంఠన్ దాని బారినపడి ప్రాణాలు కోల్పోతాడు.
ఆయనని వెదుకుతూ ఈ ప్రదేశానికి చేరుకున్న 'విల్లి' ... అలసిన కారణంగా ఒక చెట్టుకింద విశ్రమిస్తాడు. ఆ సమయంలోనే స్వామివారు ఆయనకి స్వప్న దర్శనమిచ్చి ఈ ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. స్వామివారి ఆదేశం మేరకు విల్లి ఆయనకి ఆలయాన్ని నిర్మిస్తాడు. స్వామివారికి నిత్యసేవలు వైభవంగా జరగడం కోసం అక్కడ ఒక ఊరును కూడా నిర్మిస్తాడు ... అదే 'పుత్తూరు'.
విల్లి నిర్మించిన ఊరు కనుక ఈ ప్రదేశానికి విల్లి పుత్తూరు అనే పేరు వచ్చింది. ఇక సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా చెప్పబడుతోన్న గోదాదేవి ఇక్కడ అవతరించినది కనుక ఇది 'శ్రీ విల్లిపుత్తూరు' గా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులు రంగనాయకస్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి మురిసిపోతుంటారు ... గోదాదేవి మధురభక్తిని గురించి వింటూ పరవశించిపోతుంటారు.