ఆలుమగలు దర్శించవలసిన ఆలయం
పుట్టినరోజు సందర్భంగా ... పెళ్లిరోజు సందర్భంగా ... పర్వదినాల్లోను భార్యాభర్తలు ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామివారికి పూలు - పండ్లు సమర్పించి పూజాభిషేకాలు చేయిస్తారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడమని భగవంతుడిని ప్రార్ధించి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ వుంటారు.
ఇక దైవదర్శనం చేసుకోవడం వలన ఆలుమగల బంధం మరింత దృఢపడేలాచేసే క్షేత్రాలు కొన్ని కనిపిస్తాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి 'జువ్విగూడెం' లో దర్శనమిస్తుంది. ఈ గ్రామం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలోనే 'ఉమామహేశ్వరుడు' కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ''ఉమా'' అనే నామాన్ని పలకడం మాత్రాన్నే మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఉమాదేవి సహితంగా ఆ పరమేశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఇక్కడ కనిపిస్తోన్న ఉమామహేశ్వరుడి ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడింది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం అలనాటి వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోన్న ఈ ఆలయ దర్శనం మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఇక్కడి ఉమామహేశ్వరుడిని ఆలుమగలు దర్శించుకుంటే, వాళ్ల మధ్య అనురాగబంధం మరింత బలపడుతుందని అంటారు. ఎలాంటి మనస్పర్థలు తలెత్తకుండా ... ఒడిదుడుకులు ఎదురుకాకుండా వాళ్ల దాంపత్యం అన్యోన్యంగా కలకాలం సాగిపోతుందని చెబుతారు. అందుకే ఆదిదంపతుల అనుగ్రహాన్ని పొందడానికీ ... వాళ్ల ఆశీస్సులు అందుకోవడానికి ఆలుమగలు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. ఆనందానుభూతులతో తిరిగివెళుతుంటారు.