స్వప్న దర్శనమిచ్చే గోదాదేవి !
గోదా సమేత రంగనాయకస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు ధనుర్మాసంలో మరింత ప్రాధాన్యతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ మాసమంతా కూడా భక్తులతో ఆలయాలు సందడిగా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ధనుర్మాసంలో సేవించడం వలన అమ్మవారి అనుగ్రహం ... స్వామివారి కృప త్వరగా లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
ముఖ్యంగా ఈ మాసంలో గోదా సమేత రంగనాయకస్వామిని పూజించడం వలన వివాహయోగం కలుగుతుందనీ ... దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని అంటారు. అలాంటి విశ్వాసం బలంగా కనిపించే క్షేత్రంగా 'ఏదులాబాద్' ను చెప్పవచ్చు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలంలో ఈ ప్రాచీన క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి అమ్మవారిని గురించి ఎన్నో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ ఉంటాయి.
ఒక భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి అమ్మవారు తమ జాడను తెలియజేసిందనీ, ఆమె ఆదేశంమేరకే ఆ స్వయంభువు విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని స్థలపురాణం చెబుతోంది. ఇక ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కొంతమంది భక్తులకు అమ్మవారు స్వప్నం ద్వారా తెలియజేసిందట. దాంతో వాళ్లంతా కలిసి అమ్మవారి ఆదేశాన్ని అక్షరాలా పాటించారు.
ఇక్కడ అమ్మవారు .. స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తుంటారు. ధనుర్మాసంలో ఇక్కడి గోదా రంగనాయక స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించడం వలన ... కనులపండువగా జరిగే వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని చెబుతారు. స్వప్నంలో అమ్మవారు కనిపిస్తే తమ కోరికను అమ్మవారు నెరవేర్చినట్టుగా భక్తులు భావిస్తుంటారు. పౌరాణిక నేపథ్యం ... చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయాన్ని ధనుర్మాసంలో దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.