పుష్యమాసాన లక్ష్మీదేవి ఆరాధన !
పుష్యమాసం ... చాంద్రమానం ప్రకారం పదవమాసంగా కనిపిస్తుంది. పౌర్ణమి తిథిన చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసానికి పుష్యమాసం అనే పేరు వచ్చింది. దైవారాధన ... పితృకార్యాలు జరపడానికి తగిన విశిష్టమైన మాసంగా ఇది కనిపిస్తుంది. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ పుష్యమాసంలోనే వారి ఇంటికి చేరుతుంది.
రైతులు తమ పంటను కన్న బిడ్డకన్నా ఎక్కువగా దగ్గరుండి చూసుకుంటూ ... కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అలా రక్షించుకున్న పంటను సంతోషంతో ... సంతృప్తితో వాళ్లు ఇంటికి తరలిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంటికి వచ్చిందనే ఆనందంతో వాళ్లు ఉంటారు. అందువల్లనే పుష్యమాసాన్ని 'పౌష్య లక్ష్మీ' గా పిలుస్తుంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగానే సిరులు కురుస్తాయి ... సంపదలు పెరుగుతాయి. సిరిసంపదల వల్లనే సంతోషాలు ... సంబరాలు కలుగుతాయి. అలాంటి లక్ష్మీదేవి తమ ఇంటికి రావడంకన్నా ఎవరికైనా కావలసిందేముంటుంది ? అలా వచ్చిన లక్ష్మీదేవిని ఎవరైనా ప్రేమతో పూజించవలసిందే ... అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే. అందుకే పుష్యమాసం ఆరంభమైన రోజున లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ తల్లి ఆశీస్సులను అందుకుని తరించమని స్పష్టం చేస్తున్నాయి.